ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, టచ్ ఫోన్‌లు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, చంక కర్రలు, వయోవృద్ధులకు వినికిడి యంత్రాలు అందిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాప్‌టాప్‌లకు డిగ్రీ, ఆపైన చదివే విద్యార్థులు, టెక్నికల్ కోర్సు చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. వీరు సదరం ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, కులం ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న కళాశాల ధ్రువీకరణ పత్రం ఉండాలన్నారు. టచ్ ఫోన్‌లకు ఇంటర్మీడియెట్ పాసైన బదిర విద్యార్థులు అర్హులన్నారు. మూడు చక్రాల సైకిల్, వీల్ చైర్, సంక కర్రలు, డైసీ ప్లేయర్, ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్, వృద్ధుల చేతి కర్రలు, కాలిపర్స్‌కు వైకల్య ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కులం ధ్రువీకరణ పత్రం, ఆదాయ పత్రం, రేషన్ కార్డు, రెండు ఫొటోలు అవసరమని తెలిపారు. వినికిడి యంత్రం మంజూరుకు వైకల్య ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కులం ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, రెండు ఫొటోలు, అడియో గ్రామ్ ధ్రువీకరణ పత్రం, సివిల్ సర్జన్ ధ్రువీకరణ పత్రం అవసరమన్నారు. అర్హత ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధులు 08592–281310 అనే నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment