రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
ముండ్లమూరు(దర్శి): బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి(28) మృతి చెందాడు. బెంగళూరులోని ఎక్సెల్ నీట్ అకాడమీ సెంటర్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ నుంచి భోజనానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. వెంకటేశ్వరరెడ్డి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు, బంధువులను హాస్టల్ వార్డెన్ ఎడమకంటి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరాతీశాడు. ఆచూకీ లేకపోవడంతో దగ్గర్లోని యలహంక తాలూకా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తిని పరిశీలించాలని సూచించారు. ఆ మృతదేహం లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డిదిగా హాస్టల్ వార్డెన్, బంధువులు గుర్తించారు. ఈ మేరకు గురువారం తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు బెంగళూరు బయలుదేరి వెళ్లారు.
బెంగళూరులో బుధవారం రాత్రి ఘటన
Comments
Please login to add a commentAdd a comment