వెలిగొండ..దొనకొండకు ఒట్టి చేతులే..
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు దొనకొండ రాజధాని కావాల్సి ఉంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసింది. దానికి బదులుగా దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చింది. నాటి హామీ ఏళ్లు గడుస్తున్నా నేటికీ నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేస్తామంటూ హడావుడి చేసింది. జిల్లా ఉన్నతాధికారులు సైతం పర్యటనలు చేసి నివేదికలు సిద్ధం చేశారు. విమానాశ్రయం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పారిశ్రామిక రంగానికి మంచిరోజుల వస్తాయని ఈ ప్రాంత వాసులు ఆశ పడ్డారు. అయితే తాజాగా ఎయిర్ పోర్టును ఇక్కడ నుంచి కొత్తపట్నం మండలం అలూరు– అల్లూరు మధ్యలో ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. దీంతో పారిశ్రామికవాడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే గత బడ్జెట్‌లో విశాఖ–చైన్నె పారిశ్రామిక నోడ్ అంటూ నిర్మలా సీతారామన్ ఘనంగా ప్రకటించారు. అయితే అది ఇప్పుడు ఏదశలో ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇక జిల్లా అభివృద్ధికి జీవనాధారం లాంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అంతకంటే ముందుగా నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఇప్పటి లెక్కల ప్రకారమే నిర్వాసితులకు న్యాయం చేయడానికి కనీసం రూ.2 వేల కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రులు పర్యటించి హంగామా చేశారు. అయితే కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో ఆ శ్రద్ధ చూపించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment