రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలో నూతన ప్రాజెక్టులు నెలకొల్పడం గానీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించలేదు. గ్రామీణ ప్రాంత రైతులకు, రాష్ట్రానికి ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వెనుకబడిన ప్రకాశం లాంటి జిల్లాలకు నిధుల కేటాయింపు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం అవివేకం.
– డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే
కంటి తుడుపు బడ్జెట్
ఇది కేవలం కంటితుడుపు బడ్జెట్. మధ్య తరగతి వారి ఆదాయం రూ.30 లక్షలపైన ఉన్నప్పుడు, పెద్ద పారిశ్రామికవేత్తల ఆదాయం రూ.కోట్లలో ఉంటుంది. అప్పుడు మధ్య తరగతి వ్యక్తి, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇద్దరూ ఒకే రకమైన పన్ను చెల్లిస్తారు. ఆదాయాన్ని బట్టి పన్ను విధించడం మంచి పద్ధతి. పురోగామి పన్ను, ప్రోగ్రెసివ్ టాక్సేషన్ విధానం అనేది అసలు మనదేశంలో లేదు. పురోగామి పన్ను అనేది ఆదాయం పెరిగేకొద్దీ పన్ను పెరగాలి.
– నిర్మలామణి, ప్రొఫెసర్, అర్ధశాస్త్రం, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఒంగోలు.
ఉద్యోగస్తులకు ఊరట
వేతనంపై పన్ను మినహాయింపుతో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకపోవడం ఆపై వేతనాలు ఉన్నా శ్లాబు పద్ధతిలో పన్నులు ఉండటం వల్ల ఉద్యోగులకు దాదాపుగా 40 నుంచి 50 శాతం పన్ను రాయితీ లభించినట్లే. మన రాష్ట్రానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరం.
– చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment