5న ‘ఫీజుపోరు’ను జయప్రదం చేయండి
● మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నిర్వహించే ఫీజుపోరు కార్యక్రమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో కదిలి వచ్చి జయప్రదం చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ ఫీజు పోరు గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.3,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరుబాట కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జరుగుమల్లి మండల కన్వీనర్ బత్తిన మనోహర్, జేసీఎస్ కన్వీనర్ తాటికొండ రామచంద్రరావు, మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసులు, నాగినేని భాస్కర్, దగ్గుమాటి శంకరరెడ్డి, కొమ్మాలపాటి మధు, చుండి శ్రీనివాసులు, చుండూరి సురేష్, చొప్పర శివ, ఫాస్టర్ అశోక్, వాసా నారాయణరెడ్డి, పీవీ రెడ్డి, ఎం శంకర్, నూకసాని ప్రసాద్ పాల్గొన్నారు.
మార్చి 3 నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆదేశాల మేరకు మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కె.శివకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ ఇంగ్లిష్, 5న హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు, 7న రసాయనశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, 10న భౌతిక శాస్త్రం, రాజనీతిశాస్త్రం/పౌరశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు, 12న గణితం, చరిత్ర, వ్యాపార గణకశాస్త్రం, 15న జీవశాస్త్రం, వాణిజ్య/వ్యాపారశాస్త్రం, గృహవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు.
పింఛన్ నగదుతో ఆచూకీ లేని సచివాలయ ఉద్యోగి
మార్కాపురం టౌన్: మార్కాపురంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న సచివాలయం ఎమినిటీ సెక్రెటరీ పింఛన్ నగదు తీసుకుని లబ్ధిదారులకు పంచకుండా ఆచూకీ తెలియకుండా వెళ్లిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 18వ సచివాలయంలో వార్డు ఎమినిటీ సెక్రెటరీగా పనిచేస్తున్న పి.వెంకటేశ్వర్లు వార్డులోని ప్రజలకు పంపిణీ చేయాల్సిన పింఛన్ నగదు సుమారు రూ.2.66 లక్షలను శుక్రవారం తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వార్డులోని ప్రజలకు పింఛన్ నగదు పంపిణీ చేయకపోగా ఫోన్ కూడా అందుబాటులో లేకపోవటంతో మున్సిపల్ అధికారులు ఆరాతీశారు. కమిషనర్ నారాయణరావుకు కూడా స్పందించకపోవటంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment