డబుల్ ఇంజన్ సర్కార్ బడ్జెట్‌లో సాధించింది శూన్యం
● మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు సాధించింది శూన్యమని వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బీహార్ రాష్ట్రం బడ్జెట్‌లో భారీగా అన్ని రంగాల్లో కోట్ల రూపాయల కేటాయింపులు సాధించుకుంటే మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా స్పష్టమైన కేటాయింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయటంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో 22 మంది కూటమి ప్రభుత్వ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని, కేంద్రం పై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపు జరుగుతుందని ఆశించినా ఆ ఊసే లేదన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని, కూటమి ప్రభుత్వ పెద్దలు కూతలెక్కువ పని తక్కువ అన్న చందంగా ఉందని విమర్శించారు. వేతన జీవులకు ఇన్‌కంటాక్స్‌లో రూ.12 లక్షల వరకు వెసులుబాటు కల్పించడం మంచి పరిణామమన్నారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే ధరల తగ్గింపు పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల నిస్సహాయతకు మారుపేరుగా నిలిచిన బడ్జెట్ అని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment