ఖబరస్థాన్ కథ కంచికేనా..!
ముస్లింల ఖబరస్థాన్ కథ కంచికి చేరనుంది. ఒంగోలు నగరంలో ఖబరస్థాన్‌కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ముస్లింలకు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల స్థలాన్ని సొంత కులానికి బహుమతిగా ఇచ్చేందుకు ముస్లింలను మోసం చేశారని ఎమ్మెల్యే దామచర్ల పై నగర ముస్లింలు మండిపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో 35 వేల మందికి పైగా ముస్లింలు నివసిస్తున్నారు. వీరికి కొత్తపట్నం రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఖబరస్థాన్ ఉంది. కేవలం 2 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులు పోగా ఒక ఎకరం మాత్రమే మిగిలింది. ప్రతినెలా సుమారు 100 మంది వరకు ముస్లింలు చనిపోతున్నారని అంచనా. చనిపోయిన ముస్లింలకు ఈ కొద్దిపాటి స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తక్కువ స్థలం కావడంతో ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని పూడ్చాల్సి వస్తోంది. దీంతో ముస్లింలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మరొకచోట ముస్లింలకు ఖబరస్థాన్ కోసం స్థలం కేటాయించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముస్లింల సమస్యను పరిగణలోకి తీసుకున్న గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలోని దశరాజుపల్లి రోడ్డు వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కౌన్సిల్‌లో పెట్టి తీర్మానం కూడా చేసింది.
కోర్టు కేసు వెనుక దామచర్ల...
కమ్మపాలెం సమీపంలో ఉన్న దశరాజుపల్లి రోడ్డు వద్ద ముస్లింలకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కమ్మపాలేనికి చెందిన కొందరు టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేశారు. దాంతో ముస్లింలు కూడా కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో ముస్లింలకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. నిజానికి ఇక్కడ కేవలం ముస్లింలకు మాత్రమే స్థలం కేటాయించలేదు. హిందువులకు, క్రిస్టియన్లకు కూడా స్థలం కేటాయించారు. మిగిలిన వారికి శ్మశాన వాటిక కోసం స్థలం ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం ముస్లింలకు ఖబరస్థాన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎందుకని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే కమ్మపాలెం టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేయడం వెనక దామచర్ల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దామచర్ల వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రచారం నిజమని నిరూపించేలా ఉందని ముస్లింలు చెబుతున్నారు.
ప్రెస్‌మీట్ పెట్టకుండా జులుం...
ముస్లింలకు ఇచ్చిన ఖబరస్థాన్ స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల ప్రకటించిన వెంటనే ముస్లింలలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ముస్లిం ప్రజా సంఘాలన్నీ ఏకమయ్యాయి. గత మంగళవారం ఇస్లాంపేట కమ్యూనిటీ హాలులో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముస్లిం ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే దామచర్ల తన అధికారాన్ని ఉపయోగించి ముస్లిం ప్రజా సంఘాలు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారు. టీడీపీ ముస్లిం నాయకులను రంగంలోకి దించి గుంటూరు రోడ్డులోని ఒక రైస్ మిల్లులో రహస్య సమావేశం పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో పోలీసులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఖబరస్థాన్ స్థలం రద్దు విషయంలో ఎవరైనా ప్రెస్‌మీట్లు పెట్టినా, పత్రికా ప్రకటనలు ఇచ్చినా వారిమీద గంజాయి కేసులు పెడతామని బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ముస్లిం ప్రజా సంఘాల నాయకులు మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలులో వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ముస్లిం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించి ముస్లిం కుటుంబాల్లో భయభ్రాంతులు సృష్టించడం తెలిసిందే.
మాట ఇచ్చి మోసం చేసిన దామచర్ల...
దశరాజుపల్లి కుంట ఖబరస్థాన్ విషయంలో ఖబరస్థాన్ కమిటీ నాయకులు, ముస్లిం పెద్దలను ఎమ్మెల్యే దామచర్ల పిలిపించుకొని మాట్లాడినట్లు సమాచారం. ఖబరస్థాన్ కోసం ఇచ్చిన స్థలాన్ని రద్దు చేయనని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని, దాంతో పొరపాటుగా మాట్లాడానని చెప్పినట్లు సమాచారం. ఒక వ్యూహం ప్రకారం ముస్లింల ఆగ్రహావేశాలపై నీళ్లు చల్లిన ఆయన తెర వెనుక మాత్రం ఖబరస్థాన్ స్థలం రద్దు కుట్రను కొనసాగించారు. బుధవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఖబరస్థాన్‌కు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేయనున్నారు. ఇప్పటికే కౌన్సిల్ ఎజెండా సిద్ధం చేసి కౌన్సిలర్లకు పంపించారు కూడా. ఈ విషయం తెలిసిన ముస్లింలు బిత్తర పోయారు. దామచర్ల తమను నమ్మించి నట్టేట ముంచారని వాపోతున్నారు. మాయమాటలు చెప్పి ముస్లింలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ తీర్మానం పై కోర్టు ఉల్లంఘన కేసు పెట్టేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కలకలం రేపిన ఖబరస్థాన్ స్థలం రద్దు ప్రకటన...
జనవరి 18వ తేదీ కమ్మపాలెంలో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గత ఎన్నికల్లో కమ్మపాలెం ప్రజలు తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారని, వారి రుణం తీర్చుకోలేనని చెప్పారు. కమ్మపాలేన్ని అభివృద్ధి చేస్తానంటూ అందులో భాగంగా గత ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన ఖబరస్థాన్ స్థలాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. ఆ స్థలంలో కమ్మపాలెం ప్రజల కోసం పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెడతామన్నారు. అంతే కాకుండా ముస్లింలను ఉద్దేశించి ‘‘ఎవరో ముస్లింలు’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ముస్లిం సమాజంలో కలకలం రేగింది. ఎన్నో ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న ఖబరస్థాన్ స్థలాన్ని రద్దు చేసి పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ముస్లింలు మండిపడుతున్నారు. ఎవరో ముస్లింలు అంటూ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం తగదంటున్నారు.
ముస్లింల ఖబరస్థాన్ కోసం దశరాజుపల్లి రోడ్డులో 2 ఎకరాల స్థలం కేటాయించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ స్థలాన్ని సొంత కులం కోసం రద్దు చేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ మేరకు 5వ తేదీ జరిగే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు అజెండా సిద్ధం నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారని రగిలిపోతున్న ముస్లింలు
Comments
Please login to add a commentAdd a comment