పరీక్షలు రాయలేక..
ప్రయోగాలు తెలియక..
జంబ్లింగ్ పరీక్ష రద్దుతో ఇష్టానుసారంగా ప్రాక్టికల్స్ మార్కులు..
గత ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ హవాను తగ్గించింది. సైన్స్ గ్రూపులు ఉన్న కాలేజీల్లో తప్పనిసరిగా ప్రయోగశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాల్సిందిగా నిబంధనలు పెట్టింది. అంతేకాకుండా ప్రాక్టికల్స్ పబ్లిక్ పరీక్షలకు వచ్చేసరికి జంబ్లింగ్ విధానం అమలు చేసి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల ఆధిపత్యానికి చెక్ పెట్టింది. కానీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌కు వంత పాడటంతో వాళ్లు చెప్పినట్లే నడుచుకుంటోంది. ఈ క్రమంలో పబ్లిక్ పరీక్షలు తమ కళాశాలలో ఎవరో ఒక ఇన్విజిలేటరును వేయించుకొని వాళ్లకి నచ్చినట్టుగా మార్కులు వేయించుకొని పబ్బం గడుపుకుంటున్నాయి.
నష్టపోతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు..
ఇంటర్‌లో సైన్స్ గ్రూపులు తీసుకున్న ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చాలా కష్టపడి చదువుతారు. ప్రాక్టికల్స్ మార్కులు తమ అధ్యాపకుల చేతిలో ఉండటంతో క్రమశిక్షణతో మెలుగుతారు. దీనికి తోడు సైన్స్ సబ్జెక్టుల అధ్యాపకులు ప్రయోగాలను పకడ్బందీగా నేర్పించి నిర్వహిస్తారు. థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి మరి నేర్పించి చేయిస్తారు. చివరిగా పరీక్షల్లో ప్రయోగాలు చేసి విద్యార్థులు విజయం సాధిస్తారు. మార్కులు 30 కి గాను 22,23,24,25,26 మార్కులు మాత్రమే అధ్యాపకులు వేస్తారు. అదే ప్రైవేటు కాలేజీలు అయితే వాళ్లకి నచ్చినట్లుగా మార్కులు వేసుకోవచ్చు. ఆరు నెలల పాటు థియరీ, ప్రాక్టికల్స్ నేర్చుకొని చేసి సాధారణ మార్కులు తెచ్చుకుంటే.. ఏమాత్రం ప్రాక్టికల్స్ చేయకుండా ప్రభుత్వ విద్యార్థుల కన్నా ప్రైవేటు విద్యార్థులు మార్కులు ఎక్కువగా తెచ్చుకుంటుంటారు. ఇప్పటికై నా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా ప్రతి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో ప్రయోగశాలు ఏర్పాటు చేసి జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే తప్ప ప్రభుత్వ విద్యార్థులకు న్యాయం జరగదు.
Comments
Please login to add a commentAdd a comment