మంచానికే పరిమితమైనా మనసు రాలేదా..
కనిగిరిరూరల్: పుట్టు దివ్యాంగురాలు..నోటితో పలుక లేదు. చేతులు, కాళ్లు కదుప లేదు.. మంచం దిగలేదు.. అయినా అధికారులకు, పాలకుల కళ్లకు కన్పించకపోవడం బాధాకరం. సర్కారు ఆదేశాలా.. అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ 2009–10 నుంచి వస్తున్న హెల్త్ పింఛన్‌ను నేడు కూటమి సర్కార్ కోత పెట్టింది. వెరిఫికేషన్ పేరుతో నిర్దాక్షిణ్యంగా వేటు వేసింది. దీంతో ఆ చిన్నారికి అన్నీ తానై చూసుకుంటున్న అమ్మమ్మ ఖాజాబీ లబోదిబోమంటూ బోరున విలపిస్తూ శాపనార్థాలు పెడుతోంది. వివరాల్లోకి వెళితే.. కనిగిరి పట్టణంలోని పదో వార్డు 6వ సచివాలయం పరిధిలో నివశిస్తూ ఎస్‌కే రేష్మా కుమార్తె ఇఫ్‌రత్ తారా పుట్టు వికలాంగురాలు. పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ ఖాజాబి దగ్గరే ఉంటోంది. చిన్నారికి కిడ్నీ సమస్య ఉండటంతో గతంలో ఆపరేషన్ కూడా చేయించింది. గత ప్రభుత్వంలో అప్పటి వైద్యులు చిన్నారి ఇఫ్‌రత్ తారా హెల్త్ పింఛన్ (కిడ్నీ సమస్య పింఛన్)ను మంజూరు చేసింది. అప్పటి నుంచి రూ.5 వేలు నగదు తీసుకుంటోంది. ఇటీవల ఆరోగ్య పింఛన్ పెంచి ఇచ్చిన నగదు రూ.10 వేలు కూడా తీసుకుంది. అయితే గత డిసెంబర్ నెలలో పింఛన్ వెరిఫికేషన్ పేరుతో ఒంగోలుకు పిలిపించారు. అక్కడ కొన్ని పరీక్షలు చేశారు. ప్రధాన పరీక్షలు చేయించుకుని రమ్మని గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. అక్కడ వైద్యులు మైండ్ ఆబ్సెంట్, పూర్తిగా పెరాలసిస్ బెడ్‌రిడెన్ పేషంట్‌గా ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దాన్ని తీసుకుని ఒంగోలు డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో అందజేశారు. అయితే జనవరి 1న రూ.10 వేలు పింఛన్ ఇచ్చిన అధికారులు.. ఫిబ్రవరి నెల పింఛన్‌కు అనర్హతగా వేటు వేసి పింఛన్ నగదును ఇవ్వలేదు. దీనిపై చిన్నారి అమ్మమ్మ ఖాజాబీ మాట్లాడుతూ ఏ అధికారీ మా ఇంటికి వచ్చి పాపను చూడలేదని.. చూసి ఉంటే పింఛన్ ఆపేవారు కాదని వాపోయింది. కిడ్నీ సమస్య కింద పింఛన్ రాదు అని ఒంగోలు డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, కనీసం దివ్యాంగురాలి ఫింఛన్ కూడా ఎందుకు మంజూరు చేయలేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పాపకు నెలకు మందులు, ఇతర ఖర్చులకు రూ.10 నుంచి రూ.12 వేలకు పైన అవుతుందని, పింఛన్ ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయింది. దీనిపై సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మధు మాట్లాడుతూ ఇఫ్‌తారకు పింఛన్ ఆగిన మాట వాస్తవమేనని, హెల్త్ వెరిఫికేషన్‌లో డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయం వారు హోల్డ్‌లో పెట్టారని చెప్పారు. గతంలో ఇఫ్‌తారకు (సీకేడీ) కిడ్నీ వ్యాధి కోటాలో పింఛన్ నగదు రూ.10 వేలు ఇచ్చేవారు కానీ వైద్య పరీక్షల్లో ఆ పింఛన్‌కు అనర్హురాలని ఆపారని తెలిపారు. ఇఫ్‌రత్ తారా పూర్తిగా బెడ్‌రిడెన్ అనేది వాస్తవమని, వైద్య శాఖ ఉన్నతాధికారులు పరిశీలన చేసి వెర్షన్ మార్చి మంజూరు చేస్తారన్నారు.
దివ్యాంగురాలైన పాపకు కూటమి సర్కార్ పింఛన్ కోత వెరిఫికేషన్ పేరుతో అనర్హత వేటు
Comments
Please login to add a commentAdd a comment