గజగజ వణుకుతూనే..
● భక్తుల చన్నీళ్ల స్నానాలు ● నిరుపయోగంగా గీజర్స్ ● పట్టించుకోని రాజన్న ఆలయ అధికారులు
వేములవాడ: రాజన్న భక్తులకు చలికాలం కష్టాలు వెంటాడుతున్నాయి. గీజర్స్ పనిచేయక చన్నీటి స్నానాలు చేస్తున్నారు. తలనీలాలు సమర్పించుకునే భక్తులు గజగజ వణుకుతున్నారు. చిన్నారులు, వృద్ధుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. ఒక్క నల్లా నుంచే వేడినీరు వస్తోందని, మిగతా నల్లాల్లో చన్నీళ్లు వస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటకెక్కిన గీజర్స్ ఏర్పాటు
రాజన్న భక్తులు తమ పిల్లల పుట్టువెంట్రుకలను కల్యాణకట్టలో సమర్పిస్తుంటారు. తలనీలాలు సమర్పించుకునే భక్తుల సౌకర్యార్థం గీజర్స్ ఏర్పాటు చేసి వేడి నీళ్లు అందిస్తామని అధికారులు చెప్పినా అమలుకావడం లేదు. ఇప్పటికే ఏర్పాటు చేసిన రెండు గీజర్లు పనిచేయడం లేదు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నా పాడయిన గీజర్లను మరమ్మతు చేయించాలనే ఆలోచన అధికారులకు రావడం లేదు. త్వరలోనే మహాశివరాత్రి జాతర భక్తుల రద్దీ ప్రారంభం కానుంది. ఇప్పటికై నా అధికారులు సౌకర్యాలైన గీజర్లు ఏర్పాటు చేయడం, మహిళల కోసం ప్రత్యేక స్నానపు గదులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కంపుకొడుతున్న పరిసరాలు
భక్తులు సమర్పించుకునే తలనీలాలను కాంట్రాక్టర్ ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. గత మూడు నెలలుగా తలనీలాలు సేకరించే కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో కల్యాణకట్టలో తలనీలాలు పేరుకుపోతున్నాయి. కాంట్రాక్టర్ రాకపోవడంతో ఆలయ సిబ్బంది తలనీలాలను సంచుల్లో నింపి పెడుతున్నారు. నెలల కొద్దీ సంచుల్లోనే నింపి ఉంచుతుండడంతో తెల్లపురుగులు పెరిగి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. తలనీలాల బస్తాలను ఇతర ప్రాంతానికి తరలించాలని నాయీబ్రాహ్మణులు, భక్తులు కోరుతున్నారు.
గీజర్లు ఏర్పాటు చేస్తాం
చలికాలం ప్రారంభమైంది. భక్తుల రద్దీ కూడా పెరిగింది. చలిలో వణుకుతూ భక్తులు చన్నీటి స్నానాలు చేయడం బాధాకరమే. త్వరలోనే గీజర్లను ఏర్పాటు చేసి భక్తుల ఇబ్బందులు తొలగిస్తాం. కల్యాణకట్టలో సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తాం.
– కొప్పుల వినోద్‌రెడ్డి, ఆలయ ఈవో
Comments
Please login to add a commentAdd a comment