దరఖాస్తు చేసినా లాభమేమి?
● ఏడాదిగా పరిష్కారం కావడం లేదు ● అధికారులు పట్టించుకోవడం లేదు ● ప్రజావాణిలో బాధితుల ఆగ్రహం ● అర్జీలు త్వరగా పరిష్కరించాలి.. ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● 141 దరఖాస్తులు స్వీకరణ
సిరిసిల్లటౌన్: ‘ప్రజావాణిలో అర్జీలు ఇచ్చి ఏం లాభం. ఏడాదిగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కనీసం దరఖాస్తు స్టేటస్ ఏంటో కూడా తెలి యడం లేదు..’ అంటూ వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచకు చెందిన చల్ల బాలరాజు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి హాల్‌లోనే వేములవాడ ఆర్డీవో తీరుపై అసహనం వ్యక్తం చే స్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బేడ బుడగజంగాల వర్గానికి చెందిన కొందరికీ మిడ్‌మానేరు ముంపు పరిహారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరగా పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 141 దరఖాస్తులు స్వీకరించారు.
● పెద్దూరు శివారులోని సర్వేనంబరు 62/14లో గల 20 గుంటల భూమిని బీఆర్‌ఎస్ నాయకుడు కబ్జా చేశారని తునికి మల్లవ్వ, చక్రాల రాజవ్వ, బడిగెల భూ లక్ష్మి, నీరటి లచ్చవ్వ ఫిర్యాదు చేశారు. ఈవిషయంలో విచారణ చేపట్టి, న్యాయం చేయాలని కోరారు.
● రాజన్న ఆలయం రెండో కళ్యాణకట్టలో రూ.50 టిక్కెట్ ద్వారా భక్తుల తలనీలాలు తీస్తున్న తమకు కమీషన్ ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కోరారు. రెండేళ్లకోసారి తలనీలాల కాంట్రాక్టర్ మారుతుండడంతో, తమకు దేవస్థానం తరఫున టిక్కెట్‌పై కమీషన్ ఇప్పించాలని వారి సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి నర్సయ్య, లక్ష్మణ్, నర్సింహులు కోరారు.
● జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో 50 ఏళ్ల క్రితం దళితులకు కేటాయించిన స్థలంలో నర్సింగ్ కాలేజీ, అంబేడ్కర్ భవనం నిర్మించారని, ఆ సమయంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని లబ్ధిదారులు తెలిపారు. అయితే వంద మందికి మాత్రమే ఇళ్లు ఇచ్చారని, మిగతా వారికి సైతం న్యాయం చేయాలని మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేదూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గడ్డం హన్మంతు, గౌరవ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు కోరారు.
● సిరిసిల్ల శివారులోని అపెరల్‌పార్క్‌లో ఓ కౌన్సిలర్ రూ.1.80కోట్ల భూకుంభ కోణానికి పాల్పడ్డారని బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మొగిలి రాజు ఆరోపించారు. సర్వేనంబర్ 408లో 2 ఎకరాలు, 405లో 4 ఎకరాలు లావణి పట్టా భూములు కబ్జా చేశారన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా జేసీబీలు, ట్రాక్టర్లు, కార్లు సబ్సిడీలను సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment