పీవీ పుట్టిన గడ్డపై ‘నవోదయ’ విద్యాలయం
● రాజన్న సిరిసిల్ల జిల్లాకూ మంజూరు చేయండి
● కేంద్ర విద్యాశాఖ మంత్రికి మంత్రి బండి సంజయ్ వినతి
కరీంనగర్‌టౌన్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత పీవీ నర్సింహారావు జన్మించిన ‘వంగర’లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి, వినతి పత్రం అందించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతీ మండలంలో రెండు పాఠశాలలను ప్రధానమంత్రి శ్రీ స్కీమ్ కింద స్థాపించాలని విన్నవించారు. ఈ స్కీం కింద ఎంపికై న ప్రతీ పాఠశాలకు రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరవుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించాలని కోరారు.
ఆక్రమిత భూమి అప్పగింత
సిరిసిల్ల: జిల్లాలో అసైన్డ్ భూముల కేటాయింపులు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ భూములను పట్టాలుగా పొందడంపై పోలీసులు కేసులు నమోదు చేయడం.. పట్టాలు పొందిన పలువురు జైలుపాలు కావడంతో కొందరు భూములను స్వచ్ఛందంగా వాపస్ ఇస్తున్నారు. తాజాగా తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన సుంచుల కుమారస్వామి పట్టా పొందిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వాపస్ ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ వెల్లడించారు. 464 సర్వే నంబర్‌లో కుమారస్వామి మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడు. అక్కడ షెడ్డు వేసుకున్నాడు. షెడ్డును తొలగించి ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించేందుకు ముందుకు వచ్చాడని తెలిపారు. జిల్లాలో ఎవరైనా ఇలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ హెచ్చరించారు. సదరు భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతుబంధు, పీఎం కిసాన్, పంట రుణాలు పొందితే.. ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 250 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మిడ్ మానేరుకు ఎస్సారెస్పీ నీరు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజశ్వేర(మిడ్‌మానేరు) ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ మీదుగా ప్రాజెక్టులోకి మంగళవారం 3,500 క్యూసెక్కుల మేర నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి మూడు వేల క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 25.75 టీఎంసీలకు చేరింది.
సృజనాత్మకతను వెలికి తీయాలి
బోయినపల్లి(చొప్పదండి): విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాలని డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని విలాసాగర్ హైస్కూల్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోధిస్తున్న తీరు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. పదోతరగతి ప్రత్యేక తరగతుల గురించి హెచ్‌ఎం శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment