పత్తిరైతు పరేషాన్
● దక్కని మద్దతు ధర ● కూలీల కొరతతోనూ ఇబ్బంది ● ప్రకృతి సహకరించక తగ్గిన దిగుబడి ● పెట్టుబడులు నిండవని రైతుల ఆందోళన ● మద్దతు ధర పెంచాలని డిమాండ్
చందుర్తి(వేములవాడ): వాతావరణం అనుకూలించక పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు ప్రభుత్వ మద్దతు ధర కూడా అంతంతే ఉండడంతో పెట్టుబడి డబ్బులు కూడా వచ్చేలా లేవు. గతేడాది కంటే ప్రస్తుతం రూ.600 పెంచిన ప్రభుత్వం ఏ–గ్రేడ్ క్వింటాల్‌కు రూ.7,071, బీ–గ్రేడ్‌కు రూ.7,021 చెల్లిస్తుంది. ఇదే సమయంలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,200 నుంచి రూ.6,500 వరకు చెల్లిస్తున్నారు. పూత, కాత దశలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అంతా రాలిపోయింది. పత్తిచేలలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో మొక్కలు ఎర్రబడిపోయాయి. వరుసగా కురిసిన వర్షాలు పత్తి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి.
వర్ష ప్రభావంతో..
జిల్లా వ్యాప్తంగా 45,625 ఎకరాల్లో పత్తి సాగైంది. వరి తర్వాత పత్తి పంటనే అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. ఆగస్టు నెలాఖరు నుంచి విస్తృతంగా కురిసిన వర్షాలతో నల్లరేగడి భూముల్లోని పత్తిపంట ఎర్రబడిపోయింది. కనీసం కలుపు తీసుకునే అవకాశం కూడా లేదు. భూమిలో తేమ శాతం ఉండడంతో తెగుళ్లు ఆశించడంతోపాటు కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి.
పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు
కురిసిన వర్షాలతో పత్తి పంట సాగుకు పెట్టుబడులు పెరిగాయి. ఒక్కో ఎకరాకు రూ.45వేలు నుంచి రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటలో కలుపుమొక్కల తీవ్రత పెరిగి కూలీలు ఖర్చు నాలుగింతలైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం 4 నుంచి 7 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది.
కూలీల కొరతతో ఇబ్బంది
యాసంగి వరి నాట్లతో పత్తితీసేందుకు కూలీల కొరత తీవ్రంగా ఉంది. వరినాట్ల కోసం పత్తి ఏరకుండా రైతులు ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి నల్లబడింది. దీంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు.
ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు
జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు తేమశాతం అడ్డు వస్తుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నాయి. ఇదే అవకాశంగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,200 నుంచి రూ.6,500 పెడుతున్నారు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఇతను గుగులోతు రాములునాయక్. చందుర్తి మండలంలోని జలపతితండాకు చెందిన పత్తిరైతు. పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. నల్లరేగడి భూములు కావడం, వరుసగా వర్షాలు కురవడంతో మొదట్లోనే మొక్కలు ఎర్రబడ్డాయి. భూమిలో తేమ ఎక్కువ కావడంతో పూత, కాయలు రాలిపోయాయి. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆందోళన చెందుతున్నాడు.
ధరలు ఇలా..(క్వింటాల్‌కు)
ప్రభుత్వం..
ఏ–గ్రేడ్ : రూ.7,071
బీ–గ్రేడ్ : రూ.7,021
ప్రైవేట్ వ్యాపారులు : రూ.6,200
Comments
Please login to add a commentAdd a comment