ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో తనిఖీలు
● నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు ● పలు గ్రామాల్లో సీజ్
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/వేములవాడరూరల్/వేములవాడఅర్బన్/కోనరావుపేట/బోయినపల్లి/రుద్రంగి/ఇల్లంతకుంట/చందుర్తి/వీర్నపల్లి: జిల్లాలోని పలు ఆర్‌ఎంపీల క్లినిక్‌లలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. రాచర్లగొల్లపల్లిలోని అశ్విని క్లినిక్, శివ మందుల దుకాణం, ఎల్లారెడ్డిపేటలోని నాగరాజు క్లినిక్, శ్రీవేంకటేశ్వర మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. వేములవాడరూరల్ మండలంలోని వట్టెంల, కోనరావుపేటలోని మల్లేశం క్లినిక్‌లో విచారణ చేపట్టారు. గంభీరావుపేటలోని పీఎంపీ, ఆర్‌ఎంపీల క్లినిక్‌లను అధికారులు తనిఖీ చేశారు. వేములవాడ పట్టణం గాంధీనగర్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మూడు క్లినిక్‌లను సీజ్ చేశారు. బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో ఓ ఆర్‌ఎంపీ తన క్లినిక్‌లో అనుమతులు లేకుండా యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు నిల్వ చేయడంతో సీజ్ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని పలు ఆర్‌ఎంపీ, పీఎంపీల క్లినిక్‌లను అధికారులు తనిఖీలు చేశారు. చందుర్తి మండలం నర్సింగపూర్, జోగాపూర్, కిష్టంపేట, రామన్నపేట, చందుర్తి, మల్యాల గ్రామాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లపై అధికారులు దాడులు చేశారు. చందుర్తిలోని శ్రీప్రవళిక ప్రథమ చికిత్స కేంద్రం, రుద్రంగిలో వేంకటేశ్వర క్లినిక్‌లను సీజ్ చేశారు. వీర్నపల్లిలోని మణికంఠ క్లినిక్‌ను సీజ్ చేశారు.
మూడు ఆస్పత్రులు సీజ్
ఇల్లంతకుంటలోని మూడు ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసినట్లు మండల వైద్యాధికారి శరణ్య తెలిపారు. సిరిసిల్లరూరల్ సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, పీహెచ్‌సీ వైద్యులు శరణ్య, జీవనజ్యోతి తనిఖీలు చేశారు. అనుమతులకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించి మండల కేంద్రంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేశారు. కాగా తనిఖీ సమయంలో ఆయా ఆస్పత్రుల వైద్యులు అందుబాటులో లేరు.
దాడులు చర్చనీయం
సిరిసిల్లటౌన్: జిల్లాలో వైద్యశాఖ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు బృందాలుగా విడిపోయి ప్రైవేటు ప్రాక్టీషనర్స్(ఆర్‌ఎంపీ, పీఎంపీ) క్లినిక్స్‌లపై దాడులు చేయడం చర్చనీయంగా మారింది. ప్రైవేటు ప్రాక్టీషనర్స్ క్లినిక్స్‌లలో ఇటీవల కొద్ది రోజుల క్రితం సిరిసిల్లలో ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేటు ప్రాక్టీషనర్స్ క్లిని క్స్‌పై దాడులు జరుగగా.. గురువారం పోలీస్ బందోబస్తుతో, రెవెన్యూ, వైద్యశాఖల అధి కారులు తనిఖీలు చేయడం విశేషం. జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది క్లినిక్‌లలో తనిఖీలు జరిపినట్లు డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. ఆస్పత్రి నిర్వహణ, నిబంధనలు అతిక్రమించరాదని వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఎవరిపై కూడా కేసు నమోదు చేయలేదని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment