శభాష్‌ .. సురేష్‌ సార్‌ | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ .. సురేష్‌ సార్‌

Published Thu, Sep 5 2024 2:30 PM | Last Updated on Thu, Sep 5 2024 2:30 PM

శభాష్‌ .. సురేష్‌ సార్‌

ఇబ్రహీంపట్నం: సర్కార్‌ బడి అంటేనే రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న తరణంలో ఆ పాఠశాల అభ్యున్నతికి, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కృషి చేశాడు ఆ ఉపాధ్యాయుడు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పొగాకు సురేష్‌ ప్రధానోపాధ్యాయుడిగా ఆగస్టు 2020 నుంచి సెప్టెంబర్‌ 2023 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పాఠశాల పూర్వ విద్యార్థి కావడంతో పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ సమయంలో 6 నుంచి 10వ తరగతి వరకు 350 మంది విద్యార్థులున్నారు.

పాఠశాలలో మార్పులు ఇలా..

● ఒక పీఈటీని, విద్యావలంటీర్‌ని తన సొంత డబ్బులు వెచ్చించి రెండున్నరేళ్లపాటు నియమించుకున్నారు.

● పలువురు దాతలను ఆశ్రయించి వారి సహకారంతో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయించారు.

● అన్ని తరగతి గదుల్లో సైన్స్‌ పెయింటింగ్‌లు వేయించారు.

● విద్యార్థులకు స్పోర్ట్స్‌ డ్రెస్‌లు, బ్యాగులు, షూ అందేలా కృషిచేశారు.

● పాఠశాలలో కొత్తగా ఒకేషనల్‌ కోర్సులు (అగ్రికల్చర్‌, ఎలక్ట్రానిక్స్‌) ఏర్పాటు చేశారు.

● స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి పాఠశాలలో విద్యార్థులందరికీ రోబోటిక్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించారు.

● నేషనల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌లో ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సైన్స్‌ ఫెయి ర్‌లో ప్రతిభ చాటేలా విద్యార్థులను తీర్చిదిద్దారు.

● పదో తరగతిలో ఈ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

● జాతీయ స్థాయిలో 8 మంది విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పొందుతున్నారు.

● ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అదనపు తరగతుల ఏర్పాటుకు కృషిచేశారు.

● పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి చెట్లను పెంచారు.

వరించిన రాష్ట్ర స్థాయి అవార్డు

ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. ఈ విద్యాసంవత్సరం ఈ పాఠశాలలో 8,9,10 తరగతుల్లో సీట్ల కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం 550 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదే పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈసారి పదో తరగతి పరీక్షల్లో వంద శాతం విద్యార్థులు గణితంలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. 2023లో రాష్ట్ర స్థాయితో ఉత్తమ ఉపాధ్యాయుడిగా సురేష్‌ అవార్డు అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement