10 ఏళ్లలో చెరువులు మయాం | - | Sakshi
Sakshi News home page

10 ఏళ్లలో చెరువులు మయాం

Published Thu, Oct 10 2024 7:38 AM | Last Updated on Thu, Oct 10 2024 12:55 PM

ఆక్రమణదారుల చెరలో మరికొన్ని చెరువులు

ఆక్రమణదారుల చెరలో మరికొన్ని చెరువులు

పుప్పాల్‌గూడ చెరువులో భారీ బహుళ అంతస్తుల నిర్మాణం

టీజీఆర్‌ఏసీ సర్వేలో విస్తుగొలిపే అంశాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో అనేక చెరువులు, కుంటలు కబ్జా దారుల చేతుల్లో చిక్కి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఇరిగేషన్‌, రెవెన్యూ, సర్వే, ఇతర శాఖల అధికారులు అక్రమార్కులకు అండగా నిలవడంతోనే ఈ దుస్థితి దాపురించింది. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో వెలిసిన అనేక నిర్మాణాలను ఇప్పటికే కూల్చివేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలపై సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అవుటర్‌ లోపలున్న 920 చెరువులపై తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ సర్వే చేపట్టింది. దీనిపై ఇటీవలే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నివేదికను అందజేసింది. ఇందులో విస్తుగొలిపే అంశాలు అనేకం వెలుగు చూశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 225 చెరువులు పూర్తిగా.. 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు స్పష్టం చేసింది. జిల్లాలోని బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, గండిపేట, శేరిలింగంపల్లి, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌ మండలాల్లోనే ఉన్నట్లు తేలింది. పుప్పాల్‌గూడ చెరువులో ఏకంగా ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యాభైకిపైగా అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండటం గమనార్హం. గడిచిన పదేళ్లలో జిల్లా వ్యాప్తంగా పది చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. కబ్జాదారుల చెరలో బందీ అయిన ఈ చెరువులకు హైడ్రా విముక్తి కల్పింస్తుందా? అంటే వేచి చూడాల్సిందే.

అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో..

కుంట్లూరు రెవెన్యూలో 2.88 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెస్‌కుంట(ఐడీ నంబర్‌ 818)లోని 21 శాతానికిపైగా కబ్జాకు గురైంది. 2014కు ముందు ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు, నిర్మాణాలు లేవు. 2014 తర్వాత ఇందులో పలు నిర్మాణాలు చేపట్టారు. కుంట్లూరు చెరువు 1.62 ఎకరాల విస్తీర్ణం(ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 819)లో విస్తరించి ఉంది. 2014 వరకు ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు జరగలేదు. ఆ తర్వాత చెరువు పూర్తిగా అక్రమార్కుల చేతుల్లోకి పోయి ఆనవాళ్లు కోల్పోయింది. ఇక్కడ పదికిపైగా నిర్మాణాలు వెలిశాయి. హత్తిగూడలోని 5.35 ఎకరాల విస్తీర్ణంలోని హత్తికుంట(ఐడీ నంబర్‌ 797) 13 గుంటలకుపైగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మన్నెగూడలో 11.22 ఎకరాల్లో విస్తరించిన గంగ రాయన్‌ చెరువులో ఇప్పటికే మూడు ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది. బఫర్‌ జోన్‌లోనూ పలు నిర్మాణలు వెలిశాయి. కుంట్లూరు రెవెన్యూలోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని బడికుంట ఇప్పటికే సగానికిపైగా కబ్జాకు గురైంది. హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌కుర్దులోని 7.36 ఎకరాల్లో విస్తరించిన కుంట (ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 259)లో ఇప్పటికే 4.06 ఎకరాలు కబ్జాకు గురైంది.

గండిపేటలో..

పుప్పాల్‌గూడలో 9.25 ఎకరాల్లో ఉన్న (ఐడీ నంబర్‌ 66)లోని కుంట 2014 వరకు ఎలాంటి ఆక్రమణలు లేవు. ఆ తర్వాత పూర్తిగా ఆక్రమణకు గురైంది. కుంట ఆనవాళ్లు పూర్తిగా లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో ఓ కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ 50 అంతస్థులకుపైగా భారీ భవనాన్ని నిర్మిస్తోంది. పీరంచెరువులోని 1.16 ఎకరాల్లో విస్తరించి ఉన్న పిత్రుకుంట(ఐడీ నంబర్‌ 746) పూర్తిగా కబ్జాకు గురైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భవనాలు వెలిశాయి. అలిజాపూర్‌లోని 0.82 విస్తీర్ణంలో విస్తరించిన కుంట(ఐడీ నంబర్‌ 627).. ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది. పీరంచెరువులోని 3.14 ఎకరాల వడ్డెకుంట(ఐడీ నంబర్‌ 747) 26 శాతం కబ్జాకు గురైంది. 2014 లో ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు లేవు కానీ ఆ తర్వాత చుట్టూ ప్రహరీ వెలిసింది. నీటి ఆనవాళ్లు లేకుండా చేశారు. బండ్లగూడ జాగీర్‌లోని (ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 278) కుంట ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. హైదర్ష్‌కోట్‌లోని 5.48 ఎకరాల విస్తీర్ణంలోని ఎర్రకుంటలో 2.35 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణ దారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 3.21 ఎకరాల గంధంగూడ చెరువులో ఇప్పటికే 1.25 ఎకరాలు కబ్జాకు గురైంది. 22 ఎకరాల్లో ఉన్న నెక్నంపూర్‌ చిన్నకుంటచెరువులో ఇప్పటికే పది ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది. వీటిలో పలు నిర్మాణాలు సైతం వెలిశాయి.

శేరిలింగంపల్లిలో

గోపన్‌పల్లిలో 1.53 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కుంట(ఐడీ నంబర్‌ 26) ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది. గోదాంలు, పరిశ్రమలు వెలిశాయి. మియాపూర్‌లో 8.67 ఎకరాలు ఉండల్సిన చెరువు.. ప్రస్తుతం 76 శాతానికిపైగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఖాజాగూడలోని మూడు ఎకరాల విస్తీర్ణంలోని చెరువు సైతం కబ్జాకు గురైంది. మియాపూర్‌లో 30 ఎకరాల గురునాథ్‌ చెరువులో ఇప్పటికే పది ఎకరాలు కబ్జాకు గురైంది. మదీనాగూడలోని 33.37 ఎకరాల్లోని ఐర్లకుంటలో ఇప్పటికే నాలుగు ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది.

రాజేంద్రనగర్‌లో..

బుద్వేల్‌లో 6.39 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ కుంట(ఐడీ నంబర్‌ 183)...2014 వరకు ఎలాంటి ఆక్రమణలు లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తిగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. లక్ష్మీగూడలోని బాబుల్‌కుంట(ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 176) సహా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్ద అంబర్‌పేటలోని మక్తల్‌కుంట(ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 778)లో తొమ్మిది ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది. 20 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న పల్లె చెరువులోని నూర్‌మహ్మద్‌ చెరువు 5.25 ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురైంది. గగన్‌పహాడ్‌లోని 37.24 ఎకరాల అప్పాచెరువు ఇప్పటికే 14 ఎకరాలు కబ్జాకు గురైంది. కాటేదాన్‌లోని 5.29 ఎకరాల పల్లె చెరువులో 3.17 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది.

బాలాపూర్‌లో..

మామిడిపల్లిలో 1.98 ఎకరాల్లో విస్తరించి ఉన్న మర్రివానికుంట (ఐడీ నంబర్‌ 268) పూర్తిగా కనుమరుగైంది. మీర్‌పేట్‌లోని 54.47 ఎకరాల విస్తీర్ణంలోని పెద్దచెరువు(ఐడీ నంబర్‌ 293) ఇప్పటికే 2.33 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. మల్లాపూర్‌లోని 18 ఎకరాల విస్తీర్ణంలోని సుద్దవానికుంట(ట్యాంక్‌ ఐటీ నంబర్‌ 289)లో ఇప్పటికే 1.56 ఎకరాలు కబ్జాకు గురైంది. పాపయ్యకుందన్‌లో 4.16 ఎకరాల్లోని లింగాలకుంట(ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 256)లో చాలా వరకు కబ్జాకు గురైంది. ఇదే మండల పరిధిలోని నాదర్‌గుల్‌లోని కండ్లకుంట (ట్యాంక్‌ ఐడీ నంబర్‌ 244) కబ్జాకు గురైంది. వెంకటాపూర్‌లో రెండు ఎకరాల్లోని అల్లకోని చెరువు 46 శాతం కబ్జాకు గురైంది. అదే విధంగా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో 12.4 ఎకరాల విస్తీర్ణంలోని ఎల్లమ్మబానికుంట(ట్యాంక్‌ నంబర్‌ 299)లో ఇప్పటికే రెండున్నర ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement