అద్దె భవనాలే దిక్కు!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత గూడు కరువు
● కొన్నిచోట్ల స్థల కేటాయింపులతో సరి
● మరికొన్ని చోట్ల అర్ధంతరంగా నిలిచిన పనులు
● ప్రభుత్వానికి రూ.లక్షలు సమకూరుతున్నా సమస్యలు మాత్రం యథాతథం
● కనీస సౌకర్యాలు లేక రిజిస్ట్రేషన్‌కోసం వచ్చేవారికి ఇబ్బందులు
● చర్యలు తీసుకోవాలంటున్న జనం
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమాకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో దశాబ్దాలుగా ఓ పురాతన అద్దె భవనంలో కొనసాగుతోంది. నాలుగైదు నెలలుగా రోజుకు 35 నుంచి 40 వరకు డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సుమారు నెలకు రూ.2 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. నిత్యం క్రయవిక్రయాలు, మార్టిగేజ్‌లు తదితర పనులపై ఈ కార్యాలయానికి 300 నుంచి 350 మంది వరకు వస్తుంటారు. కనీసం కూర్చునేందుకు సరైన సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాల్సిందే. ఆఫీసు సిబ్బంది ఇరుకు గదుల్లోనే విధులు నిర్వరిస్తున్నారు. డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు అనువైన స్థలం భవనంలో కొరవడింది. పార్కింగ్ స్థలం లేక రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలుపుతున్నారు. కార్యాలయం ముందు ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది.
కొత్త భవనం ఎప్పుడో..
సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి శాశ్వత భవనం నిర్మించాలని గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భావించారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న పురాతన గిడ్డంగులు (గోదాములు) తొలగించి మున్సిపల్‌కు ఆదాయాన్ని సమకూర్చే దుకాణ సముదాయం, అందులోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2022 ఫిబ్రవరిలో అప్పటి మంత్రి కేటీఆర్‌తో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ నుంచి రూ.1.50 కోట్లను మంజూరు చేశారు. తొలివిడత మంజూరైన నిధులతో గ్రౌండ్ లెవెల్ స్లాబ్ వరకు సదరు కాంట్రాక్టర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఆ ఆ తర్వాత నిధులు రాకపోవడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయాలని టీయూఎఫ్‌ఐడీసీ (రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నాయి.
ఇబ్రహీంపట్నంలో మధ్యలోనే నిలిచిపోయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవనం
భవనం సరిపోవడం లేదు
రోజుకు 30 నుంచి 40 డాక్యుమెంట్లు అవుతాయి. నెలకు సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ భవనం సరిపోవడం లేదు. మున్సిపల్ స్థలంలో పాత బస్టాండ్ వద్ద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. అది పూర్తికాగానే నామినల్ అద్దెతో అందులోకి కార్యాలయం మార్చుతారని సమాచారం.
– సోని, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం
త్వరగా పూర్తి చేయాలి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆగిపోయాయి. నిధులు మంజూరుకాలేదని చెతులెత్తేస్తున్నారు. అసంపూర్తి నిర్మాణం కారణంగా చెత్తచెదారం, పిచ్చిమొక్కలతో కంపుకొడుతోంది. భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి.
– అశోక్, స్థానికుడు, ఇబ్రహీంపట్నం
ప్రతిపాదనలు పంపాం
మంజూరైన 18 లక్షల రూపాయలతో డీఎంఎఫ్‌టీ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ట్రస్ట్) నిధులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ స్లాబ్ లెవల్ పనులు పూర్తి చేశాం. మరో కోటి రూపాయల కోసం టీయూఎఫ్‌ఐడీసీకి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
– రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం
Comments
Please login to add a commentAdd a comment