‘ప్రజావాణి’ అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు
కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరైన ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల వారీగా వెంటనే పంపించాలని సూచించారు. అర్జీలను పెండింగ్‌లో పెడితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ సమస్యలపై 53 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. అనంతరం శాఖల వారీగా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద ఆయిల్‌పామ్ మొక్కల పెంపకానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులకు సకాలంలో రాయితీలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సంగీత, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నిషేధిత జాబితా నుంచి పట్టా భూములు తొలగించండి
షాద్‌నగర్: ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితాలో రైతులకు సంబంధించి పట్టా భూములు ఉన్నాయని, వాటి తొలగించాలని హాజిపల్లి గ్రామస్తులు కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌పార్టీ నేత సింగారం సుదర్శన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో తమ భూములకు రెవెన్యూ అధికారులు పట్టా పాసుపుస్తకాలు జారీ చేసినట్లు చెప్పారు. ధరణిలో పొరపాట్ల కారణంగా చాలా మంది రైతుల పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చూడాలని కోరారు. స్పందించి కలెక్టర్ విచారణ చేపట్టి నివేదిక పంపించాలని షాద్‌నగర్ ఆర్‌డీఓ సరితకు ఆదేశాలు జారీ చేశారు.
మెడికల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
ఇబ్రహీంపట్నంరూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగా వర్చువల్ విధానంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నర్సింగ్ కళాశాల, మైత్రి క్లినిక్‌ను సోమవారం ఆదిబట్ల మున్సిపల్ పరిధి మంగళ్‌పల్లి సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజాపాలన –ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల నూతన భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment