పాస్ బుక్.. పరేషాన్!
దౌల్తాబాద్: భూములు క్రయవిక్రయాలు చేసిన పట్టాదారులకు పాసుపుస్తకాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్‌రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పట్టా చేసిన నిమిషాల వ్యవధిలోనే పాసు పుస్తకాలు అందజేస్తామని గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. వాటి బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. గతంలో వారం, పదిహేను రోజుల్లో పట్టా పాసుపుస్తకాలు వచ్చేవి. కానీ గత మూడు నెలల నుంచి పట్టాలు చేసుకున్న పట్టాదారులకు సకాలంలో పాసుపుస్తకాలు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మూడు నెలలుగా ఇబ్బంది
మండలంలో భూములు కొనుగోళ్లు చేసుకున్న పట్టాదారులు గత మూడు నెలల నుంచి సుమారు 300కుపైగా మంది ఉన్నట్లు సమాచారం. వీరికి పట్టా పాసు పుస్తకాలు అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పాసు పుస్తకాల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూములు రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న పట్టాదారులు నిత్యం పోస్ట్ సిబ్బందిని కలిసి పాసు పుస్తకాల కోసం ఆరా తీస్తున్నారు. మూడు నెలల నుంచి పాసుపుస్తకాలు అందకపోవడంపై అధికారుల వద్ద స్పష్టత లేదు. పాసు పుస్తకాల కోసం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. అధికారులు సరైన సమాధానం చెప్పక మాట దాటవేస్తున్నారు. పాసు పుస్తకాలు నేరుగా పోస్ట్ ద్వారా ఇంటికి వస్తాయని చెబుతున్నా మూడు నెలల నుంచి రాకపోవడానికి కారణం ఏంటని ఆందోళన చెందుతున్నారు.
సంక్షేమ పథకాలకు అడ్డంకి
భూములు కొనుగోలు చేసిన వారికి పాసు పుస్తకాలు రాకపోవడంతో సంక్షేమ పథకాలకు అడ్డంకిగా మారింది. పంట రుణాలు ఇతర దీర్ఘకాలిక రుణాలు, రైతుబీమా, రైతుభరోసా మార్టిగేజ్ రుణాలు పంటలు విక్రయించుకునేందుకు పాసుపుస్తకాలు లేక యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రిజిస్ట్రేషన్ అయినా అందని
పట్టా పుస్తకాలు
పత్రాల కోసం ఎదురుచూపులు
ఎలాంటి స్పష్టతనివ్వని అధికారులు
పోస్టాఫీసులో అడగండి
మూడు నెలల నుంచి పాసుపుస్తకాలు అందలేకపోవడంపై పూర్తి సమాచారం లేదు. అయితే ఎవరైనా రైతులు పట్టా పాసుపుస్తకం వచ్చిందో లేదో స్థానిక పోస్టాఫీసులో అడగండి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి త్వరలో పరిష్కరిస్తాం.
– గాయత్రి, తహసీల్దారు, దౌల్తాబాద్
Comments
Please login to add a commentAdd a comment