సమన్వయంతోనే సంపూర్ణ అభివృద్ధి
మంచాల: విద్యాప్రమాణాలు పెరిగి అభివృద్ధి దిశగా అడుగులు పడాలంటే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితోనే సాధ్యమని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని ఆరుట్ల జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే సరిపడా ఉపాధ్యాయులతో పాటుగా మౌలిక వసతుల కల్పన అవసరం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయం అవసరమన్నారు. వసతులు వినియోగించుకోలేకపోతే నిరుపయోగమవడమే కాక.. దుబారా అవుతాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకరిస్తే పాఠశాలను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఉస్మానియా వర్సిటీ అధ్యాపకులు లక్ష్మణ్, పద్మజ, ఎన్‌ఆర్‌ఐ నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతే పేదలకు విద్య అందడం కష్టతరమవుతుందన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు పెంచి సామాన్యులకు విద్యను దూరం చేస్తారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలన్నారు. ఈ నెల 28న మరోమారు విద్యార్థుల తల్లిదండ్రుతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కావాల్సిన సమాలోచనలు చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట ప్రసాద్, ఎంఈఓ రాందాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించారు.
ఉపాధ్యాయులతోనే మార్పు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అయినప్పటికీ వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. వారి నుంచే మార్పు మొదలవ్వాలి.
– మారగోని మాసయ్య గౌడ్, ఆరుట్ల
మౌలిక వసతులు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలలో మౌ లిక వసతులు కల్పించాలి. అటెండర్, వాచ్‌మెన్, స్వీప ర్లు లేరు. దీంతో పాఠశాల వాతావరణం దెబ్బతింటోంది. తక్షణమే వారిని నియమించి పాఠశాలను బలోపేతం చేయాలి.
– మాడ్గుల కృష్ణ, ఎస్‌ఎంసీ కమిటీ మాజీ చైర్మన్
ప్రీస్కూల్ ఏర్పాటు అవసరం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ప్రీ స్కూల్ ప్రారంభించాలి. ఐఐటీ, నీట్ వంటి పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.
– మోహన్ నాయక్, మాజీ సర్పంచ్, ఆరుట్ల
తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరగాలి
యాచారం: ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరగాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆకాంక్షించారు. నక్కర్తమేడిపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన విద్యార్థులు, తల్లితండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, భోజనం, వసతులలతో కూడిన నాణ్యమైన బోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు ఆసక్తి చూపడం లేదని తల్లిదండ్రులను ప్రశ్నించారు. సర్కారీ బడుల్లో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం తల్లిదండ్రుల నుంచి ఏటా రూ.వెయ్యి వసూలు చేసి, వారినే ఓనర్లుగా చేస్తే బాగుంటుందా..? అని అడిగారు. నక్కర్తమేడిపల్లి హైస్కూల్‌ను దత్తత తీసుకున్న ఆమెజాన్ సంస్థ రూ.కోటి ఖర్చు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రైవేటు సంస్థల సహకారం అవసరమని తెలిపారు. దాతలు, స్థానికులు సైతం ముందుకు రావాలన్నారు. అనంతరం గును గల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల గదులను కూల్చవద్దని, వీటిని ఇతర పనులకు వినియోగించుకునే అవకాశం ఉంటే పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పాండురంగారెడ్డి, నక్కర్తమేడిపల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఉదయశ్రీ, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు ఉన్నారు.
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
ఆరుట్ల జెడ్పీహెచ్‌ఎస్(బాలుర)లో తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం
Comments
Please login to add a commentAdd a comment