సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
● ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్
షాద్‌నగర్: గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్‌లో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు చందునాయక్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాంబాల్‌నాయక్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం అని అన్నారు. మహారాజ్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా గిరిజనులు మాత్రం అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారన్నారు. గిరిజనులు సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఉండే తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చాలా తండాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా గిరిజనుల మాతృబాష అయిన గోరోబోలీని రాజ్యాంగంలోని 8వ ఆర్టికల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత పాలకులు గిరిజనుల మాతృభాషకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఈ నెల 29న పట్టణంలో ఎల్‌హెచ్‌పీఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మిట్టునాయక్, మంగులాల్‌నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment