‘వినియోగం’ మారినా కూల్చుడే! | - | Sakshi
Sakshi News home page

‘వినియోగం’ మారినా కూల్చుడే!

Published Fri, Dec 20 2024 7:28 AM | Last Updated on Fri, Dec 20 2024 7:28 AM

‘వినియోగం’ మారినా కూల్చుడే!

‘వినియోగం’ మారినా కూల్చుడే!

సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: ‘హైడ్రా–2.0’ తన పంథాను పూర్తిగా మార్చుకుంది. కూల్చివేతల విషయంలో సామాన్యులకు ఇబ్బందులు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. కేవలం చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలే కాదు.. నిబంధనల విరుద్ధంగా గృహావసరాలకు అనుమతులు తీసుకుని, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న నిర్మాణాలపైనా చర్యలు తీసుకుంటోంది. మణికొండ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్న అనుహర్‌ మార్నింగ్‌ రాగా అపార్ట్‌మెంట్‌తో దీన్ని ప్రారంభించింది. ఓ ఫిర్యాదు ఆధారంగా ముందుకు వెళ్లిన హైడ్రా, స్థానిక అధికారులు దాని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని వ్యాపార సముదాయాలను గురువారం కూల్చేసింది.

ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణమవుతూ..

నగరంలోని ఎన్నో నిర్మాణాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. పార్కింగ్‌తో పాటు ఇతర అవసరాల కోసం కేటాయిస్తూ అనుమతి తీసుకున్న, కేటాయించాల్సిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వాడేస్తున్నారు. దీంతో అటు నివాసితులకు, ఇటు ఆ మార్గంలో ప్రయాణించే వారికి ఇక్కట్లు తప్పట్లేదు. నివాసితుల వద్దకు వచ్చే విజిటర్స్‌తో పాటు ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రహదారిపై పార్క్‌ చేసుకుంటున్నారు. ఇది తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణం అవుతోంది.

అపార్ట్‌మెంట్‌ వాసుల ఫిర్యాదులతో..

అనుహర్‌ మార్నింగ్‌ రాగా అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెసిడెన్షియల్‌కు అనుమతి తీసుకుని, వ్యాపార సముదాయాలుగా మారుస్తున్నారంటూ 38 ఫ్లాట్ల నివాసితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం నార్సింగి పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని చెప్పారు. దీని ఆధారంగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్థానిక మున్సిపల్‌ అధికారులతో కలిసి రెండు వారాల క్రితం క్షేత్రస్థాయి పరిశీలించారు. వివిధ అభ్యంతరాల నేపథ్యంలో హైడ్రా కార్యాలయంలో ఇరుపక్షాల వారిని సమావేశపరచడంతో పాటు అపార్టుమెంట్‌ నిర్మాణ అనుమతులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. దీంతో రెసిడెన్షియల్‌ అనుమతి పొందిన భవనంలో కమర్షియల్‌ నిర్మాణాలు చేపడుతున్నట్లు తేలింది. ఎలివేషన్‌ కారిడార్లను మూసి ఓ బ్యాంక్‌నకు అవసరమైన స్ట్రాంగ్‌ రూం నిర్మాణం చేయడంతో అపార్ట్‌మెంట్‌కు పగుళ్లు కూడా వచ్చినట్లు గుర్తించారు. వాహనాల బ్యాటరీ చార్జింగ్‌ పాయింట్ల ప్రమాదాల నేపథ్యంలో నివాసితుల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అనుహర్‌ మార్నింగ్‌ రాగా అపార్టుమెంట్‌ నిర్మాణ యజమాని హర్షవర్ధన్‌ రెడ్డికి సంబంధిత విభాగాలు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు.

షోకాజ్‌ తర్వాత డిమాలిషన్‌ నోటీసులు..

మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులకు హర్షవర్ధన్‌రెడ్డి స్పందించకపోవడంతో అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆపై డిమాలిషన్‌ నోటీసులు ఇస్తూ అవసరమైన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో హైడ్రా సమక్షంలో స్థానిక అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ మినహా ఔటర్‌ రింగురోడ్డు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణ మున్సిపాలిటీస్‌ యాక్ట్‌ 2019 సెక్షన్‌ 178 (2) ప్రకారం హైడ్రాకు సమకూరిన అధికారాల ఆధారంగా కమిషనర్‌ కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని వ్యాపార సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో చిరు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ట్రాఫిక్‌, స్థానికులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.

మిగతా వాటికీ వర్తింపజేయాలి..

అనుహర్‌ మార్నింగ్‌ రాగా అపార్ట్‌మెంట్‌ కింద ఉన్న 14 షటర్లను అధికారులు గురువారం తొలగించారు. మున్సిపాలిటీకి కమర్షియల్‌ పన్నులు చెల్లిస్తున్న షటర్‌లను తాము కొనుగోలు చేసి వ్యాపారాలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అవి కూల్చేయడం ఎంత వరకు సబబు అంటూ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకోవాల్సిన అధికారులు కాలయాపన చేశారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నివాసిత అనుమతులతో వందలాది భవనాలలో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేశారని, వాటిపైనా హైడ్రా చర్యలు తీసుకోవాలంటున్నారు. తాము అప్పులు చేసి, ఆస్తులు అమ్మి వ్యాపారాలు పెట్టుకున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అపార్ట్‌మెంట్లలో నిబంధనల ఉల్లంఘన

గృహావసరాలకు వాడాల్సిన భవనాలు వాణిజ్యానికి..

ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్న హైడ్రా

మణికొండ అల్కాపురిలో షటర్ల కూల్చివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement