పేదరికం.. చికిత్స భారం!
తాండూరు టౌన్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఓ చిరు వ్యాపారి దినదిన గండంలా కాలం వెళ్లదీస్తున్నారు. రోజుకు రూ.8 వేల విలువైన ఇంజక్షన్లు చేయిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. కానీ చుట్టుముట్టిన పేదరికంతో చికిత్స భారంగా మారిందని తాండూరు పట్టణానికి చెందిన కల్లూరు రాజశేఖర్ తన దీనగాథను వెల్లడిస్తున్నాడు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.
రూ.3 లక్షలు కావాలి
పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన రాజశేఖర్.. భార్య సునీత, ఓ కూతురుతో కలిసి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచీలు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కిరాణా దుకాణాలకు సరఫరా చేసి, వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు. 2008లో ఆయనకు కాలేయ సంబంధిత వ్యాధి ప్రారంభమైంది. అప్పటినుంచి మందులు వాడుతూనే ఉన్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు కోలుకోగా, మళ్లీ రెండేళ్లుగా వ్యాధి తిరగబెట్టింది. దీంతో వ్యాపారం నిలిచిపోయి, ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిత్యం పని చేసుకుని బతికే తమకు ఇలాంటి కష్టాలు వచ్చాయని ఇంటిల్లిపాది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తిరిగి రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈక్రమంలో ఏడాదిగా ఇంటి కిరాయి సైతం చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యానికి డబ్బులు లేక రెండు నెలలుగా నిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి రావడానికి సైతం కిరాయి చార్జీలు లేవని వాపోతున్నారు. కొన్నాళ్ల పాటు రోజుకు రూ.8 వేల విలువైన ఇంజక్షన్లు తీసుకుంటేనే వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. కోర్సు పూర్తయ్యేందుకు సుమారు రూ.3 లక్షల అవుతాయని చెప్పారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలని రాజశేఖర్ దంపతులు దీనంగా అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి స్పందించి, ప్రభుత్వం తరఫున వైద్య సాయం చేయించాలని వేడుకుంటున్నారు. దాతలు కూడా సహకరించి, ప్రాణం నిలబెట్టాలని కోరుతున్నారు. ఫోన్ నంబర్ 90592 94199 ద్వారా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నారు.
చిరు వ్యాపారికి పెద్ద ఆపద
ఎమ్మెల్యే, దాతలుఆదుకోవాలని అభ్యర్థన
Comments
Please login to add a commentAdd a comment