పేరుకే మున్సిపాలిటీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఏళ్లు గడుస్తున్నా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజలు ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. విశాలమైన రోడ్లు సంగతేమో కానీ.. ఆశించిన స్థాయిలో మురుగు నీటి కాల్వలు కూడా లేకపోవడంతో ఇళ్ల నుంచి వెలువడిన మురుగు వీధుల్లో ఏరులై ప్రవహిస్తోంది. స్థానికుల ముక్కు పుటాలను అదరగొడుతోంది. ఈగలు, దోమలకు నిలయంగా మారి ప్రజల అనారోగ్యానికి కారణమవుతోంది.
ఇళ్ల మధ్యే మురుగునీటి ప్రవాహం
జిల్లాలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సహా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవి పూర్తిగా నగరానికి ఆనుకుని ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 363 వార్డులు, 51.05 కిలోమీటర్ల ఓపెన్ డ్రైనేజీలు ఉండగా, 924.37 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మరో 381.71 కిలోమీటర్ల కచ్చ డ్రైనేజీలు ఉన్నాయి. శంషాబాద్, శంకర్‌పల్లి, జల్‌పల్లి, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల మధ్యే మురుగునీరు ప్రవహిస్తోంది. ఆస్తిపన్ను వసూళ్లు సహా ప్రభుత్వం వివిధ గ్రాంట్ల రూపంలో ఆయా మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నప్పటికీ మౌలిక వసతులు మాత్రం మెరుగుపడటం లేదు. పట్టణ ప్రగతి సహా ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా గత ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఎస్‌ఆర్‌డీపీ కింద ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తి కాలేదు. శంకర్‌పల్లి మెయిన్‌రోడ్డులో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రెండు కిలోమీటర్ల మేర చేపట్టిన పనులు ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. మీర్‌పేట్, బడంగ్‌పేట మున్సిపాలిటీల్లో డ్రైనేజీ పనులు ఏళ్లుగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ముంచుకొస్తున్న ముప్పు
పాలక వర్గాలు ఏర్పడి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. జనవరి చివరి వారంతో ఆయా పాలక మండళ్ల గడువు ముగియనుంది. నాలుగేళ్లుగా స్థానికుల అవసరాలను పట్టించుకోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో కొత్త పనుల శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. ఆఘమేఘాల మీద కౌన్సిల్ మీటింగ్‌లు ఏర్పాటు చేయడం, ఎజెండాలో ఆయా అంశాలను పెట్టి ఏకంగా తీర్మానాలు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఇంతకాలం ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, బహుళ అంతస్తుల భవనాలు, బంధువులు, రియల్టర్ల సేవల్లో తరించిన పాలకులకు అకస్మాత్తుగా ఓటర్లు గుర్తు రావడం, ఆ మేరకు వారి మౌలిక అవసరాలు గుర్తించి, బడ్జెట్ కేటాయింపులు చేయించి శంకుస్థాపనలు చేయిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముగియనున్న పాలకమండళ్లపదవీకాలం
కనీస వసతులకు నోచుకోని జనం
ఇప్పటీకీ పూర్తికాని అండర్ డ్రైనేజీ పనులు
ఇళ్ల మధ్యే ఏరులై పారుతున్న మురుగునీరు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment