వ్యవసాయాభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు కృషి
కాచిగూడ: వ్యవసాయాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో ‘పొడినేల వ్యవసాయం – సమస్యలు, సవాళ్లు’ అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో నీరు లేక భూములు డ్రైల్యాండ్‌గా మారి పంటలు పండక ప్రజలు వలస వెళ్లే వారని అన్నారు. ప్రస్తుతం భూములను సారవంతం చేయడంతో ఆ పరిస్థితిని అధిగమించి పంటలను పండిస్తున్నారని తెలిపారు. మేధావులు, యువత వ్యవసాయ రంగంపై ప్రజలకు అవగాహన పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. సదస్సులో తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ముత్యంరెడ్డి, యూఓహెచ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ మాజీ డీన్ ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీజిత్ మిశ్రా, సీఈఎస్‌ఎస్ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment