క్రిస్మస్ కాంతులు
క్రిస్మస్ వేడుకలకు జిల్లాలోని చర్చిలు
ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపిలా బొమ్మలను తీర్చిదిద్దారు. బుధవారం ప్రత్యేక ప్రార్థనల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కేశంపేట: విద్యుత్‌దీపాల వెలుగులో పాటిగడ్డలోని లూర్దుమాత దేవాలయం
అమిత్‌షా వ్యాఖ్యలపై ఫైర్
ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర మంత్రి అమిత్‌షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌పై పార్లమెంట్ సాక్షిగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కొంగరకలాన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ మంత్రి పుష్పలీలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీజేపీ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసిన అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లోకి ర్యాలీగా వెళ్తుండగా జరిగిన తోపులాటలో మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల కిందపడిపోయారు. పార్టీ నాయకులు తనను అవమానానికి గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి, చెల్లి కిందపడిపోతే ఇలాగే చేస్తారా అని వాపోయారు. తన ప్రాణం పోయినంత పనయ్యిందని, సంధ్య థియేటర్ ఘటన గుర్తుకు వచ్చిందని వాపోయారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి, బడంగ్‌పేట్ కార్పొరేషన్ చైర్మన్ చిగురింత పారిజాత, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, పామెన భీంభరత్, మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయమ్మ, మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కేశంపేట: పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జీపీ వర్కర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి అన్నారు. జీపీ కార్మికులతో కలిసి మంగళవారం ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డికి సమ్మె నోటీసు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో గ్రామ పంచాయతీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె నిర్వహించగా, అప్పట్లో ప్రతి పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాంచంద్రయ్య, పారేష, యాదయ్య, మల్లయ్య, మాసయ్య, పద్మ, బుచ్చమ్మ, రామస్వామి, రోశయ్య పాల్గొన్నారు.
నాంపల్లి కోర్టుకు లగచర్ల రైతులు
సిటీ కోర్టులు: లగచర్లలో అధికారులపై దాడి కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన రైతులు మంగళవారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత మొదటి విచారణ నేపథ్యంలో నాంపల్లిలోని ప్రిన్సిపల్ ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ ఏసీబీ కోర్టు జడ్జి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ విచారణ మార్చి 28కి వాయిదా వేశారు.
ఉద్యాన పంటల సాగుతో లాభాలు
షాద్‌నగర్‌రూరల్: ఉద్యానవన పంటల సాగుతో అధిక లాభాలు గడించొచ్చని ఉద్యాన శాఖ జిల్లా అధికారి సురేష్ అన్నారు. ఫరూఖ్‌నగర్‌లో సాగు చేసి ఉద్యానవన పంటలను మంగళవారం ఒడిశాకు చెందిన పలువు రు అధికారులు, రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, కూరగాయలు, మామిడి, నిలువు పద్ధతిలో టమాటా సాగు, ఫాలీహౌస్‌లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తోందని, రైతులకు సబ్సిడీపై పనిముట్లను అందజేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్‌పామ్ డీజీఎం రామ్మోహన్‌రావు, అధికారులు హిమబిందు, మల్లారెడ్డి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment