దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి
ఇబ్రహీంపట్నం: బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పొతినేని సుదర్శన్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలోని సీతారాం ఏచూరి ప్రాంగణంలో జరుగుతున్న పార్టీ జిల్లా మహాసభల్లో భాగంగా ఆదివారం రెండోరోజు జరిగిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. నిత్యావసరవస్తువులతోపాటు అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నా కట్టడి చేసే పరిస్థితుల్లో పాలకులు లేరన్నారు. యువతకు ఉపాధి కల్పనలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. పెట్టుబడిదా రులు, కార్పొరేట్ సంస్థలు లాభపడేవిధంగా పేదల భూములను ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవాదాన్ని కాపాడేందుకు సీపీఎం కట్టుబడి ఉందన్నారు.
వాగ్దానాల అమలులో విఫలం
ఎన్నికల ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ విఫలమైందని సుదర్శన్ విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే పోరుబాట పడతామని హెచ్చరించారు. జనవరి 25న సంగారెడ్డి జిల్లాలో జరిగే పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
దేశంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి రెండు న్నర లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తే.. రూ.80 వేల కోట్లు తగ్గించి పేదల జీవనోపాధిని కేంద్రం దెబ్బ తీస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన ఆయావర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే విధంగా దేశంలో, రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల బాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు సామేల్, యాదయ్య, జగదీశ్, మధుసూదన్‌రెడ్డి, కవిత, చంద్రమోహన్, శోభన్, రాంచందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
వాగ్దానాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ప్రజా సమస్యలపై పోరుబాట
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పొతినేని సుదర్శన్
Comments
Please login to add a commentAdd a comment