నుమాయిష్ టికెట్ ధర పెంపు
అబిడ్స్: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్.సురేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కన్వీనర్లు సురేష్‌కుమార్, సురేష్‌రాజ్ మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్‌ను మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌లో డబుల్ డెక్కర్ బస్సును మినీ ట్రైన్‌తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ రూ.30, డబుల్ డెక్కర్ టికెట్ రూ.40గా నిర్ణయించినట్లు చెప్పారు.
కమాండ్ కంట్రోల్, వైఫై టవర్..
మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్‌ఫోన్ల నెట్‌వర్క్ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్‌లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డేగా, జనవరి 31వ తేదీని చిల్డ్రన్స్ డేగా ప్రకటించినట్లు తెలిపారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
రూ.40 నుంచి రూ.50కి ప్రవేశ రుసుము
జనవరి 3 నుంచి ఎగ్జిబిషన్
సుమారు 2 వేల స్టాళ్లు ఏర్పాటు
వివరాలు వెల్లడించిన సొసైటీ ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment