అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తాం.. పోరాడుతాం
ఆరాంఘర్–జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
వంతెనకు డా.మన్మోహన్‌సింగ్ ఫ్లైఓవర్‌గా నామకరణం
మెట్రో రెండో దశపై ప్రధానితో మాట్లాడా...
ఎంతమంది జైలుకెళ్తారో నాకై తే తెల్వదు..
పాతబస్తీ అభివృద్ధికి అసద్‌తో కలిసి పనిచేస్తాం..
రీజినల్ రింగ్‌రోడ్డుతో తెలంగాణ అభివృద్ధి వేగవంతం
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాజకీయా లు..జైలు జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. కొత్తరేషన్ కార్డులు మంజూరు, రైతులకు ఈ ప్రభుత్వం సహకరించడం మంచి పరిణామమని అంటూ..రేవంత్‌రెడ్డి జైలులో ఉన్నప్పుడు తనకు వంట చేసిపెట్టిన వాళ్లను కూడా మర్చిపోకుండా పిలిపించుకు ని సహాయం చేయడం మంచి పరిణామం అన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు జైలుకెళ్లడం సామాన్యంగా మారిందని, ఇప్పుడు మాత్రం ఎవరు..ఎంతమంది జైలు కు వెళ్తారో తనకై తే తెలియదన్నారు. తనను కూడా అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు 1998లో జైలుకు పంపారన్నారు. తాను అప్పట్లో 50 రోజులు జైలు జీవితం గడిపానన్నారు. జైలుకెళ్తే కష్టసుఖాలు బాగా తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీ బస్టాండ్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలును వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. మీరాలం మండి నుండి చార్మినార్ వరకు స్కైవాక్ ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..పాతబస్తీ ఒవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ వరకు నిర్మించనున్న మెట్రో రైలు ట్రిపుల్ డెక్కర్ ట్రాన్స్‌పోర్టు సిస్టంలో నడవాలన్నారు. ఇప్పటికే ఈ మార్గంలో కింద రోడ్డు ప్రయాణం కొనసాగుతుండగా పైనుంచి ఫ్లైఓవర్ ఉందన్నారు. ఈ ఫ్లై ఓవర్ పైనుంచి మెట్రో రైలు వెళ్లనుంది అన్నారు. గత ప్రభుత్వం ఓల్డ్‌సిటీని ఇస్తాంబుల్, సింగపూర్‌లా మారుస్తామన్నప్పటికీ, చార్మినార్ పాదచారుల పథకం కూడా పూర్తిచేయలేదన్నారు. టూరిజం పాలసీలో మక్కా మసీదుతోపాటు ఇతర మసీదులను కూడా చేరిస్తే బాగుంటుందన్నారు. ఓల్డ్‌సిటీలో బస్టాండ్లతో పాటు మినీబస్సులు కూడా అందుబాటులోకి తేవాలన్నారు.
ఆరాంఘర్ ఫైఓవర్ ఏరియల్ వ్యూ
సాక్షి, సిటీబ్యూరో/బహదూర్‌పురా /చార్మినార్: గ్రేటర్ నగరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం తర్వాత..తిరిగి కాంగ్రెస్ హయాంలోనే ఇప్పుడు రెండో అతి పెద్ద ఆరాంఘర్– జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభించుకున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్తగా నిర్మాణమైన ఈ ఫ్లైఓవర్‌ను సోమవారం సాయంత్రం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీలో కానీ, ఇప్పుడు కానీ హైదరాబాద్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ ఫ్లైఓవర్‌కు డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఫ్లైఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం రోడ్ల విస్తరణ, మెట్రో రైలు విస్తరణలతోపాటు గోదావరి జలాలు తేవడం ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన తదితర కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా చేస్తున్నామన్నారు. నిజాం కృషితో హైదరాబాద్ నగరానికి లేక్స్ అండ్ రాక్స్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు ఉండేదని, దాన్ని నిలుపుకొని ఉంటే, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌తో పోటీ పడే నగరమే ఉండకపోయేదన్నారు. కానీ కాలక్రమేణా కబ్జాదారులు, ఆక్రమణల వల్ల నగర సుందరీకరణ పూర్తిగా దెబ్బతిన్నదని, నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు, ట్రాఫిక్ జామ్స్ తప్పడం లేదన్నారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు..
ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం మోదీతో పోరాడాల్సి వచ్చినా, అసద్‌తో కలిసి పనిచేసేందుకై నా సిద్ధమన్నారు. నగరాభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రధాని వేరే పార్టీ అయినా నగరాభివృద్ధి కోసం మాట్లాడానన్నారు. అక్బరుద్దీన్ తన చిన్ననాటి స్నేహితుడన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ఆయన అడిగిన పనులన్నింటికీ నిధులు మంజూరు చేసే జిమ్మేదారి తనదని భరోసా ఇచ్చారు. మీరాలంపై కేబుల్ బ్రిడ్జి నిర్మించి, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. చర్లపల్లి టెర్మినల్ చాలా కాలం పెండింగ్‌లో ఉండగా, తాను సీఎం అయ్యాక పనులు ముందుకు సాగాయన్నారు. టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానితో మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటయ్యాక గత పదేళ్లలో హైదరాబాద్ మెట్రో రైలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విషయాన్ని గుర్తుచేశానన్నారు. ముఖ్యంగా గౌలిగూడ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మెట్రో పనులకు ఒక్క ఇటుక కూడా పడలేదని, అందుకే హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సిందిగా కోరినట్లు చెప్పారు.
రీజినల్ రింగ్‌రోడ్డుతో అభివృద్ధి
ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా అత్యవసరమని, అది పూర్తయితే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్‌తో పాటు, రీజినల్ రింగ్ రైలును, వికారాబాద్–కొడంగల్–కృష్ణా రైల్వే లైన్ కోసం కూడా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తా, ఎవరితోనైనా పోరాడుతా అన్నారు.
ఒరిజినల్ సిటీ ఇదే..
హైదరాబాద్ పాత నగరం కాదని..ఇదే ఒరిజినల్ సిటీ అని, హైదరాబాద్ అభివృద్ధి కోసం 10 లేదా 11వ తేదీన ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంబంధిత అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, తాము నిర్మించిన ఫ్లై ఓవర్‌ను రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని బీఆర్‌ఎస్ వాళ్లు చెప్పుకుంటున్నప్పటికీ, తాము అధికారంలోకి వచ్చాకే సరైన సమయానికి నిధులిచ్చి పనులు పూర్తిచేయించామన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో రూ.301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment