ఎక్కడైనా అంతే.. ఆరోగ్యం గల్లంతే! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడైనా అంతే.. ఆరోగ్యం గల్లంతే!

Published Fri, Jan 17 2025 10:35 AM | Last Updated on Fri, Jan 17 2025 10:35 AM

ఎక్కడైనా అంతే.. ఆరోగ్యం గల్లంతే!

ఎక్కడైనా అంతే.. ఆరోగ్యం గల్లంతే!

ప్రైవేట్‌ హోటళ్లే కాదు.. ప్రభుత్వ సంస్థల్లోనూ అదే తీరు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరంలో చిన్న హోటళ్లలోనే కాదు, బడా స్టార్‌ హోటళ్లలోనూ ప్రజలకు వడ్డించే ఆహారంపై గ్యారంటీ లేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఎంతో పేరెన్నికగన్న ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోనూ వంటగదుల బండారం బట్టబయలైంది. నిల్వ ఉంచిన ఆహారం, కనీస జాగ్రత్తలు లేకపోవడం కూడా వెలుగు చూడటం తెలిసిందే. హైదరాబాద్‌ బిర్యానీతో పాటు ఇతరత్రా ఆహారాలకు ఎంతో పేరున్నప్పటికీ, ఫుడ్‌ సేఫ్టీ లేకపోవడం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఫుడ్‌ సేఫ్టీఅండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ర్యాంకుల్లోనూ తెలంగాణకు దక్కింది అధమ స్థానమే. అయినా నగరంలో హోటల్‌ నిర్వాహకుల తీరు మారలేదు. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల్లోని హోటళ్లలో ఆహారం కల్తీ కాదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చాలామంది భావిస్తారు. కానీ.. అది కూడా నిజం కాదని, అక్కడ కూడా ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని వెల్లడైంది.

నీళ్లు నమిలిన మేనేజర్లు..

నగరంలోని ప్రజాభవన్‌కు సమీపంలోనే ఉన్న టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ప్లాజాలోని ‘మినర్వా’లో సాంబార్‌ రైస్‌లో ఓ వినియోగదారుకు బొద్దింక కనిపించింది. దీంతో హతాశుడైన అతను ఇదేమని మేనేజర్లను ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. పొరపాటైందని అన్నారు. మీరు తరచూ వస్తుంటారుగా సార్‌.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా కాలేదుగా అన్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని పేర్కొంటూ.. వీడియోలు సహా అతను సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం వైరల్‌గా మారింది. ఇలాంటి ఆహార వడ్డనతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని, తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

లోపాలు వెలుగులోకి వస్తున్నా..

నగరంలో కొంత కాలంగా ఎక్కడ తనిఖీలు నిర్వహించినా ప్రమాణాలు పాటించకపోవడం, ఫుడ్‌సేఫ్టీ లేకపోవడం బట్టబయలవుతూనే ఉన్నాయి. లోపాలు వెల్లడవుతున్నప్పటికీ, నిర్వాహకులపై చర్యలు లేకపోవడం వల్లే పరిస్థితిలో మార్పు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టూరిజం ప్లాజాలో గదులు దొరకడం అందరికీ సాధ్యం కాదు. దేశ, విదేశీ పర్యాటకులెందరో విడిది చేసే టూరిజం ప్లాజాలోని హోటల్‌లోనే పరిస్థితి ఇలా ఉండటాన్ని చూసి ప్రజలు బయట ఎక్కడ తినాలన్నా భయపడాల్సి వస్తోంది.

టూరిజం ప్లాజాలోని ‘మినర్వా’ ఆహారంలో బొద్దింక

వినియోగదారుడి ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement