వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభం
ప్రజలను చైతన్యపరిచేలా ప్రదర్శనలు
సంగారెడ్డి జోన్: వైకల్యం శరీరానికి మాత్రమే అవుతుంది.. మనసుకు కాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే దివ్యాంగులూ అద్భుత విజయాలను సాధించగలరని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. దివ్యాంగుల క్రీడల ప్రాముఖ్యత, స్ఫూర్తిదాయకమైన విజయాల గురుంచి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికి చదువు అత్యంత కీలకం అన్నారు. చదువుతోనే మనం మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. ఐఏఎస్ శిక్షణ సమయంలో తన బ్యాచ్‌మేట్ అజయ్ అరోరా గురించి ఆమె ప్రస్తావిస్తూ, ఆయన పూర్తిగా అంధుడు, తన పట్టుదలతో ఐఏఎస్ సాధించి, ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్‌లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. చదువులో మంచి స్థాయిని సాధించి జీవితంలో ముందుకు వెళ్లాలని, మీ ప్రయత్నం మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణం కావాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కాగా, దివ్యాంగుల క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. సోలార్ సొసైటీని స్థాపించి, తానే ఆదాయం పొందడమే కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించడం ద్వారా అందరికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, యువజన సంక్షేమ శాఖ అధికారి ఖాసీంబేగ్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు సాయికుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్య పరిచే విధంగా కళాజాత ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు సందర్భంగా తెలంగాణ సాంస్కృత సారధి కళాయాత్ర కార్యక్రమాలను జిల్లాలో ముమ్మరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి డిసెంబరు 7వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలన కళాయాత్ర వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంస్కృతిక సారధి కళాబృందాలు ప్రతిరోజు మూడు గ్రామాలలో ఆటపాటలు నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేరువ చేసే విధంగా కళా ప్రదర్శనలు జరగాలన్నారు. కార్యక్రమాలను మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే సంబధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మజా రాణి, డీపీఆర్‌ఓ ఏడుకొండలు తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment