సేవకు సదావకాశం పోలీస్ శాఖ
డీఐజీ రెమా రాజేశ్వరి
● పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ● హాజరైన కలెక్టర్, ఎస్పీ
సంగారెడ్డి జోన్: ప్రజలకు సేవ చేసేందుకు పోలీసు శాఖ కల్పించిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఉమెన్ సేఫ్టీ వింగ్, డీఐజీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. గురువారం చిద్రుప్పలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకుని, కానిస్టేబుల్స్‌గా విధుల్లో చేరుతున్న సందర్భంగా ట్రైనీ కానిస్టేబుల్స్‌కు పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ నిర్వహించారు. సైబరాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సీపీఎల్– అంబర్‌పేట్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన 224 మంది స్టైపెండరీ కాడెడ్ ట్రైనీ ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీతోపాటు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేశ్ హాజరై ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ...పోలీసింగ్ అనేది నిరంతర శిక్షణ ప్రక్రియన్నారు. కొత్త కొత్త నేరాల ద్వారా మరిన్ని విషయాలు నేర్చుకుంటూ, అటువంటి నేరాలు మళ్లీ జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు.
ధన, మాన,ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి...
మహిళల భద్రతకు, ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఎదురు నిలబడి సామాన్య ప్రజలకు భరోసా కల్పించేది పోలీస్ శాఖేనని చెప్పారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మాట్లాడుతూ...శిక్షణలో భాగంగా నూతన చట్టాలతోపాటు ప్రత్యేక–ప్రాంతీయ చట్టాలు, నేరపరిశోధన, ఇంటెలిజెన్స్ –అంతర్గత భద్రత, వ్యక్తిత్వ వికాసం, లాఠీ డ్రిల్ వంటి అంశాలు నేర్పించామన్నారు. నేటి నుంచి పూర్తిస్థాయి కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తూ..మంచి ప్రవర్తనను కలిగి ప్రజలకు సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment