స్వచ్ఛ బడి.. స్ఫూర్తి ఒడి
● అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సర్వీస్ సిబ్బంది నియామకం
● విద్యార్థుల సంఖ్యను మేరకు నిధుల కేటాయింపు
● మూడు నెలలకు సంబంధించి రూ.1.59 కోట్లు విడుదల
● ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తప్పిన ఇబ్బందులు
విద్యార్థుల సంఖ్య నిధులు పాఠశాలలు
1–30 రూ.3వేలు 281
31–100 రూ.6వేలు 405
101–250 రూ.8వేలు 177
251–500 రూ.12వేలు 35
501–750 రూ.15వేలు 12
751 కంటే ఎక్కువ రూ.20వేలు 02
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య సమస్య తీరింది. ఏడాదిన్నర కిందట పాఠశాలల్లో పని చేసే స్కావెంజర్లను తొలగించారు. దీంతో పాఠశాలలో పారిశుద్ధ్య సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. అమ్మ ఆదర్శ పాఠశాల నేతృత్వంలో పారిశుద్ధ్య సమస్యకు ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపింది. విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు నెలలకు సంబంధించిన నిధులను సోమవారం రూ.1.59 కోట్లను కలెక్టర్ మనుచౌదరి విడుదల చేశారు.
నెలకు రూ.53 లక్షలు
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో సర్వీస్ పర్సన్‌లను తాత్కాలికంగా నియమించి వారికి నెలసరి వేతనాలు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇలా విద్యా సంవత్సరానికి 10 నెలలపాటు వేతనం చెల్లించనునున్నారు. సర్వీస్ పర్సన్‌లతో మరుగుదొడ్లు, తరగతి గదులను శుభ్రంతో పాటు పాఠశాలల్లో పచ్చదనం కోసం మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా అప్పగించారు. జిల్లాలోని 912 ప్రభుత్వ పాఠశాలలకు నెలకు రూ 53,29,000 నిధులును విడుదల చేయనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.1,59,87,000 లు విడుదల చేశారు.
తప్పిన ఇబ్బందులు
పాఠశాలలను శుభ్రపరిచే బాధ్యతలను గతంలో పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. దీంతో వారికి కాలనీలు, గ్రామాల్లో ఊడ్చే సరికే సమయం సరిపోవడంతో ఎప్పుడో ఒకసారి వెళ్లి శుభ్రం చేసేవారు. పాఠశాలలో మరుగుదొడ్లను, తరగతి గదులను శుభ్రం చేయకపోవడంతో పాఠశాలలకు ఆధునిక హంగులు కల్పించినా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమస్యలు తప్పలేదు. పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు తీసుకెళ్లారు. దీంతో పారిశుద్ధ్య పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఇబ్బందులు తప్పాయి.
ఉచిత విద్యుత్ నిర్ణయం
పలు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు అమలవుతున్నాయి. అలాగే పలు పాఠశాలల్లో సాంకేతిక విద్య కోసం కంప్యూటర్లను అందించారు. సాంకేతిక బోధనతో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. పాఠశాల గ్రాంట్ సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయులే సొంత డబ్బులను చెల్లించేవారు. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించారు.
పాఠశాల పరిశుభ్రంగా..
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో సర్వీస్ పర్సన్‌లను తాత్కాలికంగా నియమించాం. వారి ద్వారా పాఠశాల తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి. గతంలో స్కావెంజర్ల తొలగింపుతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. కలెక్టర్ ఆమోదంతో నిధులు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఆయా పాఠశాల కమిటీల అకౌంట్‌లలో జమ కానున్నాయి.
– శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment