బెల్ట్ షాపులపై నిఘా పెట్టాలి
● సిద్దిపేట సీపీ అనురాధ
● పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష
సిద్దిపేటకమాన్: ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బెల్ట్ షాపులపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని, బెల్ట్ షాపులు నిర్వహించకుండా సంబంధిత వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని సీపీ అనురాధ సూచించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళ, ఉమెన్స్ మిస్సింగ్ కేసుల్లో దరఖాస్తులు రాగానే వెంటనే కేసు నమోదు చేసి, పరిశోధన చేసి ట్రేసవుట్ చేయాలన్నారు. మిస్సింగ్ కేసుల్లో అలసత్వం వహించొద్దన్నారు. డిసెంబర్ 14న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌లో లిస్టవుట్ చేసిన కేసులను డిస్పోజల్ చేయాలని అధికారులకు సూచించారు. మీ సేవ నుంచి అప్లికేషన్‌లను డిస్పోజల్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని, తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలను సందర్శించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా ఉంచాలని సూచించారు. సమావేశంలో సిద్దిపేట ఏసీపీ మధు, గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీష్, ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment