సరిహద్దులు తేల్చరేం!
● ప్రహసనంగా హెచ్‌ఎండీఏ చెరువుల సర్వే ప్రక్రియ ● జిల్లాలో చెరువులు 603 ● మూడేళ్లలో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన చెరువులు పది శాతమే ● మూడు శాఖల మధ్య సమన్వయ లోపం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరువుల సరిహద్దులు తేల్చే ప్రక్రియ ప్రహసనంగా మారింది. నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులతో హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ) అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో సరిహద్దుల తేల్చే ప్రక్రియ జిల్లాలో ఆశించిన మేర ముందుకు సాగడంలేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రక్రియ మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అమీన్‌పూర్, గుమ్మడిదల, హత్నూర, జిన్నారం, కంది, పటాన్‌చెరు, రామచంద్రాపురం, సంగారెడ్డి మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో మొత్తం 603 చెరువులు ఉన్నాయి. నీటి వనరులైన చెరువులను ఆక్రమణలకు గురికాకుండా ఆపేందుకు గత ప్రభుత్వం హయాంలో ఈ చెరువులకు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ సరిహద్దులను నిర్ణయించాలని నిర్ణయించింది. పైన పేర్కొన్న శాఖల అధికారులు ఆయా చెరువు వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ఆయా చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ సరిహద్దులను తేల్చాలి. ఈ మూడు శాఖల అధికారులు కలిపి ఇచ్చిన నివేదిక మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ఉంచి వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని పరిష్కరించాక ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసి, సరిహద్దులను తేలుస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా మొక్కుబడిగానే సాగుతోంది.
సుమారు మూడేళ్లుగా..
ఈ చెరువుల సర్వే ప్రక్రియ గత మూడేళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ మూడుశాఖల అధికారులు ఒకేసారి కలసి చెరువుల వద్దకు వెళ్లడం, రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయి సర్వే జరపడంలో సమన్వయం కుదరడం లేదు. దీంతో ఈ ప్రక్రియ గత మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు. ఆయా శాఖల అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం కూడా ఈ ప్రక్రియ నత్తనడకన సాగడానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. హైడ్రా పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ చెరువుల సరిహద్దులు నిర్ణయించే ఈ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది.
పది శాతం దాటని ప్రగతి..
మండలాల వారీగా పరిశీలిస్తే..
జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలో 8 మండలాలు ఉండగా ఈ మండలాల్లో మొత్తం 603 చెరువులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు కేవలం 58 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే మూడేళ్లుగా కనీసం పది శాతం చెరువుల సరిహద్దులను కూడా తేల్చలేదంటే అధికారులు అలసత్వాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే 468 చెరువులు ప్రైమరీ నోటిఫికేషన్ దశలోనే ఉన్నాయి. అంటే ఇంకా 135 చెరువులకు సంబంధించిన ఇప్పటివరకు కనీసం ఈ ప్రక్రియకే శ్రీకారం చుట్టలేదంటే ఆయాశాఖల అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment