రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు
జోగిపేట(అందోల్)/వట్‌పల్లి(అందోల్): అందోల్ నియోజకవర్గంలో రూ.600 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ వెల్లడించారు. నియోజకవర్గంలో 13 రోడ్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.30 కోట్లను కేటాయించిందని మంత్రి తెలిపారు. చలికాలం ప్రారంభం కావడంతో వసతి గృహాలు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్ల పంపిణీలతో పాటు మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచినట్లు వివరించారు. మంగళవారం అందోల్, పుల్కల్ మండలంలో రూ.8.47కోట్ల రోడ్డు మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ప్రతీ గ్రామంలోని రహదారులను మరమ్మతులు చేసేందుకు నిధులను కేటాయిస్తామని తెలిపారు. మంత్రి పార్రంభించిన పనుల్లో పుల్కల్ మండలంలో కోడూరు ఎక్స్ రోడ్డు నుంచి బొమ్మారెడ్డిగూడెం మీదుగా అందోల్ మండలం కొండారెడ్డిపల్లి వరకు రూ.4.69 కోట్లతో చేపట్టనున్న రోడ్డుకు కోడూరు వద్ద, అందోల్ మండలం డాకూరు పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మాసానిపల్లి మీదుగా పోతిరెడ్డిపల్లి వరకు రూ.2.38 కోట్లతో చేపట్టనున్న రోడ్డుకు, మాసానిపల్లి చౌరస్తా వద్ద, రూ.1.40 కోట్లతో రోళ్లపాడ్ గేటు నుంచి గ్రామం లోపలి వరకు చేపట్టనున్న రోడ్ల పనులు ఉన్నాయి.
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
నియోజకవర్గానికి కొత్తగా నర్సింగ్ కాలేజ్, 150 పడకల ఆసుపత్రి తీసుకొచ్చామని దామోదర రాజనర్సింహ వివరించారు. ఏడాది కాలంలోనే 54 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. నియోజకవర్గానికి రూ.3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు, కమిషనర్ తిరుపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, రాష్ట్ర మార్క్‌ఫేడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గొల్ల అంజయ్య, మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోళ్లపాడ్ మర్రిచెట్టు కింద మంత్రి
అందోల్ మండలంలో మంగళవారం పర్యటన సందర్భంగా మంత్రి దామోదర రోళ్లపాడ్ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద అరుగుపై కొద్దిసేపు కూర్చున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...1990లో తొలిసారి తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత గ్రామానికి వచ్చి ఆర్టీసీ బస్సును ప్రారంభించి గ్రామస్తులతో కొద్దిసేపు ముచ్చటించానని గుర్తు చేశారు. తన రాజకీయ ప్రస్థానం ఈ మర్రిచెట్టు కింద నుంచి ప్రారంభమైందని చెప్పారు. గ్రామంలోని పెద్ద మనుషులను పిలిపించుకుని వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
రూ.8.47కోట్ల రోడ్డు మరమ్మతు
పనులు ప్రారంభించిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment