గ్రామాల అభివృద్ధే లక్ష్యం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి శివారులో రైతులు పొలాలకు వెళ్లేందుకు రూ.10లక్షల నిధులతో మట్టి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
‘ఉపాధి హామీ పనులు
సద్వినియోగం చేసుకోవాలి’
కొండాపూర్(సంగారెడ్డి): ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం, అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాందాపూర్‌లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ... డా. బీఆర్.అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలైన రోజును పురస్కరించుకుని రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా జీవిస్తున్నాడు అంటే అది కేవలం రాజ్యాంగం ద్వారా మాత్రమేనని తెలిపారు.
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ఆర్డీవో కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన
జహీరాబాద్‌టౌన్: దేశంలో కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్డీవో రాంరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా కొత్త లేబర్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఎల్‌ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కూడా భోజన విరామ సమయంలో ఆందోళనలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల
అభివృద్ధికి ప్రభుత్వం కృషి
జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంజయ్య
రాయికోడ్(అందోల్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంఽథాలయాల సంస్థ చైర్మన్ జి.అంజయ్య పేర్కొన్నారు. రాయికోడ్‌లోని ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి మంగళవారం స్థానిక నాయకులతో కలసి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రగతి పథంలోకి
గ్రామాల్ని తీసుకెళ్లాలి
డీఆర్డీవో జ్యోతి
సంగారెడ్డిటౌన్: గ్రామాల్లో అభివృద్ధి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించిందని, గ్రామాల్ని ప్రగతిపథంలోకి నడిపించాలని డీఆర్డీవో జ్యోతి పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో మంగళవారం ‘మన ఊరిలో జాతర పనులు’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఉపాధిహామీలో పనులను గుర్తించి ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment