రోడ్ల నిర్మాణానికి రూ.20.86 కోట్ల మంజూరు
● గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ● ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వెల్లడి
పటాన్‌చెరు: నియోజకవర్గంలోని గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలి పారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఆర్‌ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.20.86 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు. మండల పరిధిలోని నందిగామ నుంచి భానూరు గ్రామం వరకు రూ.కోటి అంచనావ్యయంతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి నిధు లు కేటాయిస్తున్నామన్నారు. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం నందిగామ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.50 వేలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment