నిరీక్షణకు మోక్షం
● రైల్వే ఓవర్‌బ్రిడ్జి పెండింగ్ పనుల కోసం రూ.10.90 కోట్లు విడుదల ● నిధుల మంజూరులో మంత్రి దామోదర ప్రత్యేక చొరవ
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పెండింగ్ నిర్మాణం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ఆర్వోబీ పనులకు రూ.10.90 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిధుల కొరత కారణంగా సుదీర్ఘ కాలం పాటు రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు నిలిచి పోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర జాప్యం కలుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి సమస్య తీవ్రతను మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన మంత్రి పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఇటీవల మంజూరు చేయించారు. ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు గాను 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.90కోట్ల నిధులను బ్రిడ్జి నిర్మాణం, భూ సేకరణ కోసం మంజూరు చేసింది. ఇందులో భూ సేకరణ నిధులు పోను బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.40 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేసింది.
2018లో పనులు ప్రారంభం
2018 ఆగస్టు 30న ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. రెండేళ్ల క్రితం రెండు పర్యాయాలు కలిపి రూ.25కోట్లు నిధులు విడుదల చేశారు. మిగతా నిధులు విడుదలకాకపోవడంతో నిర్మాణం పనులు నిలిచి పోయాయి. 2022 డిసెంబర్ నుంచి కాంట్రాక్టర్ ప్రధాన నిర్మాణం పనులు పక్కన పెట్టి చిన్న చిన్న పనులు మాత్రమే కొనసాగించారు. దీంతో పనుల్లో నత్తనడకన సాగాయి. బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్ నిర్మాణం, సీసీ నిర్మాణం పనులు, ఎలక్ట్రిక్ పనులు, జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ డ్రైయిన్ల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్ బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు.
తరచూ రైళ్ల రాకపోకలతో ఇబ్బందులు
జహీరాబాద్ పట్టణం నుంచి ముంబై, బీదర్ రహదారులకు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదే రహదారిపై రైల్వే లైన్ ఉండటంతో రైల్వే గేటు ఏర్పాటు చేశారు. నిత్యం ఈ దారి గుండా 30కి పైగాా రైళ్ల రాకపోకలు సాగుతాయి. దీంతో తరచూ గేటును మూసివేస్తుంటారు. గేటును మూసినప్పుడల్లా 20 నుంచి 30 నిమిషాలపాటు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించి వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment