మెరుగైన సేవలు.. పెరిగిన ప్రసవాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రులంటే ప్రజలకు సరైన నమ్మకం లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. అక్కడ సరైన వైద్యం అందకపోయినా వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా గర్భిణులు అధిక శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. కాని నేడు పరిస్థితులు మారాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు భరోసా కలిస్తూ మంచి వైద్యం అందించడంతో రోగులు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు.
జిల్లాలో జిల్లా ఆస్పత్రి 1, ఏరియా ఆస్పత్రులు 4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2, పీహెచ్‌సీలు 29, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు 445 ఉన్నాయి. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. అక్కడకు వెళ్లిన వారికి వైద్యులు అధిక శాతం గర్భిణులకు అవసరం లేకున్నా సీజరింగ్ చేసి అధిక డబ్బులు వసూలు చేసేవారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని ప్రభుత్వాస్పత్రులకు వచ్చేలా చర్యలు చేపట్టింది.
అవగాహన కార్యక్రమాలు
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్యులకు, వైద్య సిబ్బందికి తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అధిక ప్రసవాలు నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందిస్తుంది. దీంతో ఆస్పత్రులకు వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు గర్భిణులకు నమ్మకం కలిగేలా, సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది.
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులకుక్యూ కడుతున్న గర్భిణులు
2024లో లక్ష్యానికి మించి23,811 ప్రసవాలు
ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
లక్ష్యానికి మించి..
2023లో 22,263 ప్రసవాలు లక్ష్యం కాగా 24,489 ప్రసవాలు జరిగాయి. 2024లో 21,618 ప్రసవాలు లక్ష్యం కాగా 23,811 ప్రసవాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమష్టి కృషితో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య లక్ష్యానికి మించి జరుగుతున్నాయి. ఈనెల 16న న్యాల్‌కల్ పీహెచ్‌సీలో కేవలం 17 గంటల వ్యవధిలో ఐదు ప్రసవాలు చేసి న్యాల్‌కల్ పీహెచ్‌సీ రికార్డు సృష్టించింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment