మొసళ్ల కలకలం
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చండూర్ గ్రామ శివారులో గల మంజీరా వాగు తీరానికి బుధవారం రెండు మొసళ్లు వచ్చాయి. వాటిని చూసిన పలువురు రైతులు భయాందోళనకు గురయ్యారు. మంజీరాలో ఉంచిన మోటార్లు చెడిపోతే వాటి కోసం నదిలో దిగాల్సి ఉంటుందని, మొసళ్లను చూసిన తర్వాత నదిలో దిగడం అసాధ్యమన్నారు. సంబంధిత అధికారులు మొసళ్లను పట్టుకొని మంజీరా పరివాహా ప్రాంత రైతులకు ధైర్యం కల్పించాలన్నారు.
ఎనగండ్ల చెక్ డ్యాంపై..
కొల్చారం(నర్సాపూర్): ఎనగండ్ల గ్రామ శివారులోని మంజీరా చెక్ డ్యాం పైన బుధవారం మొసలి కలకలం సృష్టించింది. చేపల వేటకు వెళ్లిన జాలర్లకు మిట్ట మధ్యాహ్నం చెక్ డ్యాంపై సేద తీరుతూ కనిపించింది. దాదాపు 60 కిలోల వరకు ఉంటుందని తెలిపారు.
జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
మర్కూక్(గజ్వేల్): జాతీయస్థాయి సైన్స్ టాలెంట్ పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజ ప్రతిభ చాటి తృతీయ స్థానంలో నిలిచిందని ఎంఈఓ వెంకటరాములు తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థినికి శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో 2024 జాతీయస్థాయి వినూత్న ఆలోచనలు సేకరణలో భాగంగా పాఠశాల నుంచి ఆరు టీమ్స్ ద్వారా ప్రాజెక్టు నమూనాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన సందర్భంగా 18 మంది విద్యార్థులకు, గైడ్ ఉపాధ్యాయుడు బ్రహ్మయ్యకు ప్రశంసాపత్రం అందజేశారు. వినూత్న ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.20 లక్షలు నుంచి రూ.1.50 లక్షల వరకు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏడుపాయల టెండర్ల
ఆదాయం రూ.2.46 కోట్లు
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల ఆలయం వద్ద వివిధ విక్రయాల కోసం బుధవారం నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.2.46 కోట్ల ఆదాయం వచ్చింది. ఈఓ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీల్డ్, ఓపెన్ టెండర్లు నిర్వహించారు. కొబ్బరికాయలు, బోండాలు విక్రయించుకునే హక్కు కోసం వేలం పాట నిర్వహించగా 8 మంది పాల్గొన్నారు. ఇందులో రూ.కోటి 11 లక్షల 20 వేల పాట పాడి మెదక్ పట్టణానికి చెందిన లింగోజీ వేలం దక్కించుకున్నారు. అలాగే, ఒడి బియ్యం పోగు చేసుకునే హక్కును జీవన్‌రెడ్డి అనే వ్యక్తి రూ.కోటి 9 లక్షల 50 వేలకు పాడారు. పూజ సామగ్రి విక్రయాలు చేసుకునేందుకు రూ.17 లక్షలు పాట పాడి బుడాల నర్సింలు వేలం దక్కించుకున్నారు. తల నీలాల కోసం నిర్వహించిన టెండర్లలో ఖమ్మంకు చెందిన ఎస్.దుర్గారావు రూ.8,30,000 పాట పాడారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేటెండర్ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment