
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): మంజీరా వాగులోకి చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన జలగం ఏసు(36) చేపల వేట కోసం 16వ తేదీన మంజీరా వాగులోకి వెళ్లాడు. రెండు రోజులు అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకు తుండగా మంజీరా పాయలోని ఓ గుండు పై మృతదేహమై కనిపించాడు. ఏసుకు తరచూ ఫిట్స్ వచ్చేదని, అదే మృతికి కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ..
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారి లోతు వాగు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రేపల్లె వాడుకు చెందిన పిట్ల సాయిలు ఆరేళ్ల కిందట బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. భార్య స్వప్న (26) రెండేళ్ల నుంచి పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ కారు షోరూం లో పని చేస్తుంది. స్వప్న మేన బావ శ్రీనుతో కలిసి బైక్ పై ఎల్లారెడ్డికి వస్తుంది. బైక్ లోతు వాగు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి మామ సంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
రెండో అంతస్తు నుంచి పడి కార్మికుడు
పటాన్‌చెరు టౌన్: రెండో అంతస్తుపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామా నికి చెందిన యోగీశ్వర్ రెడ్డి (30) కేకే ఎనర్జీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పాశమైలారంలోని ఓ పరిశ్రమలో సోలార్ పలకలు కడిగే పని కోసం బుధవారం వెళ్లాడు. రెండో అంతస్తులో పని చేస్తుండగా కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరికి గాయాలు..
కొండపాక(గజ్వేల్): బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అక్బర్, మహమ్మద్ రియాన్ సిద్దిపేటలో బంధువు మృతి చెందడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. దుద్దెడ శివారులో మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక 108 అంబులెన్సు సిబ్బంది గణేశ్, శ్రీనివాస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment