గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డేగల వెంకటరామరాజు (53) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గణేశ్ నగర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ రాజుకు ఉదయం గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్, ధరణి కుమార్, రాజేశ్, పోలీసు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది మృతదేహాంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు రూ.30 వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కానిస్టేబుల్ అకస్మాత్తుగా మృతి చెందడంపై సీపీ అనురాధ సంతాపం వ్యక్తం చేశారు.
దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): దైవ దర్శనానికి వెళ్లి వస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్‌కు చెందిన నగేశ్ గౌడ్ (48) తన మిత్రులతో కలిసి 15వ తేదీ సాయంత్రం శబరిమలైలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న అనంతరం బుధవారం తిరిగి తమిళనాడులోని మధురై చేరుకుని మీనాక్షి దేవాలయంలో దర్శనం చేసుకున్నారు. రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం రామేశ్వరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున బాత్ రూమ్‌కి వెళ్లొచ్చిన నగేశ్ గౌడ్ ఒక్కసారిగా బెడ్‌పై పడిపోయాడు. గమనించిన తోటి మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం జగదేవ్‌పూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment