రైతు కష్టం రోడ్డు పాలు
● ఓవర్‌లోడ్‌తో జారీ పడుతున్న చెరకు
● నష్టపోతున్న అన్నదాతలు
జహీరాబాద్ టౌన్: చెరకు రైతులు ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. విత్తనం నాటి నుంచి పంట సరఫరా వరకు నానాఅవస్థలు పడుతున్నారు. కర్మాగారానికి చెరకు సరఫరా చేసే సమయంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. నియోజకవర్గంలో అధిక శాతం మంది రైతులు చెరకు పంటను పండిస్తుంటారు. చెరకు నరికేందుకు కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో కటింగ్ చేసే యంత్రాలను తీసుకొచ్చా రు. ఈ సంవత్సరం జహీరాబాద్ ప్రాంతంలో సుమా రు 15కు పైగా యంత్రాలు చెరకు పంటను కటింగ్ చేస్తున్నాయి. పొలంలోని పంటను యంత్రాలే చెరుకును నరికి ముక్కలు చేసి లారీలు, ట్రాక్టర్లలో నింపుతున్నాయి. అయితే ఫ్యాక్టరీకి తరలించే క్రమంలో దెబ్బతిన్న రోడ్ల కారణంగా లారీలో నింపిన చెరకు ముక్కలు జారీ కింద పడుతున్నాయి. ఓవర్ లోడ్ నింపడం వల్ల పెద్ద మొత్తంలో చెరకు పంట రోడ్డు పాలవుతోంది. రోజూ పదుల సంఖ్యలో లారీలు కర్మాగారానికి తరలిస్తుండటంతో కొన్ని టన్నుల చెరకు ముక్కలు రోడ్డుమీదే పడిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జహీరాబాద్–బీదర్ రహదారి దెబ్బతిని గుంతలమయంగా తయారైంది. ఈ రోడ్డు గుండా వెళ్లే లారీల నుంచి చెరకు కింద పడటంతో ఇరు పక్కలా కుప్పలు కుప్పలు దర్శనమిస్తుండటం గమనార్హం. లారీ క్యాబిన్ లోపలి వరకు మాత్రమే చెరకు నింపాలని రైతులు యంత్రాల నిర్వాహకులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment