నిమ్జ్ భూముల పరిహారం పెంచాలి
● రూ.15 లక్షలివ్వడం సమంజసం కాదు
● ఈ భూములపై ఆధారపడినకూలీలకు సైతం రూ.10 లక్షలు ఇవ్వాలి
● సీపీఎం అఖిల జాతీయ కమిటీ సభ్యుడు వెంకట్
జహీరాబాద్ టౌన్: నిమ్జ్ కోసం సేకరిస్తున్న భూముల నష్ట పరిహారం పెంచాలని సీపీఎం అఖిల భారత కమిటీ సభ్యుడు వెంకట్ డిమాండ్ చేశారు. పట్టణంలోని భీం భవన్ హాల్‌లో మంగళవారం నిమ్జ్ భూ నిర్వాసితులు–ప్రభుత్వ వైఖరి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వెంకట్ మాట్లాడుతూ.. జహీరాబాద్ పరిధిలో ఏర్పాటుచేస్తున్న నిమ్జ్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకుంటున్నారన్నారు. 2013 చట్టాన్ని నీరుగార్చి తక్కువ ధరకు ప్రభుత్వం కొంటుందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ. 50 లక్షలకు పైగా పలుకుతుంటే ప్రభుత్వం రూ.15 లక్షలు చెల్లించడం సమంజసం కాదన్నారు. వెంటనే పరిహారాన్ని పెంచాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. పంటలు పండే సారవంతమైన భూములను తీసుకొని తక్కువ పరిహారం ఇవ్వడం వల్ల రైతుల కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూ బాధితులకు 120 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో 5 సంవత్సరాల లోపు ప్రాజెక్టు పనులు ప్రారంభించకుంటే చట్టప్రకారం తిరిగి ఇవ్వాలన్నారు. ఈ భూములపై ఆధారపడిన కూలీలకు పునరావాసం కల్పించాలని, రూ.10 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. నిమ్జ్ రైతులు, కూలీలకు తాము అండగా ఉంటామని, వారి కోసం ఉద్యమాలు చేస్తామని చెప్పారు. నిమ్జ్ భూ బాధితులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment