పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, గ్రామసభలలో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ సర్వేలో పెండింగ్ ఉన్న వాటిని, గ్రామాల్లో లేని వారిని గ్రామాలకు పిలిపించి వారి వివరాలు సేకరించి సర్వే పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని కొల్లూరు, తెల్లాపూర్‌లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఇళ్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ చలపతి, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్‌లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment