గ్రూప్ 3 పరీక్షలకు పటిష్ట బందోబస్తు
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు సీపీ అనురాధ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం సిద్దిపేట పట్టణంలో 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఈనెల 17న ఉదయం 6గంటల నుంచి 18 రాత్రి 8 గంటల వరకు పట్టణంలో163 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ సెంటర్స్ మూసివేయాలని సూచించారు. అలాగే 500 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడి ఉండరాదన్నారు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, ఆందోళన చెందకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు. పరీక్షల బందోబస్తు కోసం ముగ్గురు అదనపు డీసీపీలు, నలుగురు ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు, 37మంది ఎస్‌ఐలు, వివిధ విభాగాల సిబ్బంది మొత్తం 381 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
రవాణా సమస్యలు రానివ్వం
పరీక్షలు సజావుగా సాగేందుకు 4 రూట్ మొబైల్స్, 4 ఎస్కార్ట్ టీంలు అప్రమత్తంగా ఉంటాయని సీపీ అన్నారు. జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల డిపో పరిధిలో ఆర్టీసీ బస్ సేవలు వినియోగించి అభ్యర్థులకు రవాణా సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12–30వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 5–30 వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్ణీత సమయానికి అర్ధగంట ముందే గేట్లు మూసీ వేస్తారని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించరని తెలిపారు. పరీక్షలు బయో మెట్రిక్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 13,408 మంది గ్రూప్ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
17 నుంచి 163 సెక్షన్ అమలు
పట్టణంలో 37 పరీక్షా కేంద్రాలు
హాజరుకానున్న
13,408 మంది అభ్యర్థులు
పోలీస్ కమిషనర్ అనురాధ
Comments
Please login to add a commentAdd a comment