అర్హత లేకున్నా.. చికిత్స!
సాక్షి, సిద్దిపేట: వైద్య సేవలు అందించాలంటే అల్లోపతిలో ఎంబీబీఎస్, ఆయుర్వేదంలో బీఏఎంఎస్, హోమియోపథిక్‌లో బీహెచ్‌ఎంఎస్ పూర్తి చేయాలి. ఆయా మెడికల్ బోర్డులలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రతి ఒక్క వైద్యునికి రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆయా బోర్డులు కేటాయిస్తారు. అలాంటిది వైద్య విద్య ఏమి చదవకుండానే ఇష్టారాజ్యంగా పలువురు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎలాంటి అర్హత లేనివారు వైద్యం చేస్తుండటంతో రోగుల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు చోట్ల రోగులు మృత్యువాత పడిన ఘటనలున్నాయి.
మోతాదుకు మించి..
ఏదైనా అనారోగ్య సమస్యకు ఎలాంటి మందులు ఏమోతాదులో ఇవ్వాలనేది వైద్య విద్య పూర్తి చేసిన వారికి అవగాహన ఉంటుంది. కొన్నింటికి సాధారణ ట్యాబ్‌లెట్స్ ఇస్తే సరిపోతుంది. ఇంకొన్నింటికి యాంటీబయాటిక్స్ అవసరమవుతుంది. అదే ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అవసరం లేకున్నా మోతాదుకు మించి ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్‌ను విరివిరిగా వినియోగిస్తున్నారు. దీని వల్ల తాత్కాలికంగా నయమవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం వలన రోగనిరోధకతను దెబ్బతీయడమే కాక ఇతర అనారోగ్య సమస్యలకూ కారణమవుతుంది. భవిష్యత్తులో కొత్త రోగాలను తీసుకొస్తుంది. ఇలా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
పట్టించుకోని వైద్యారోగ్య శాఖ
జిల్లాలో పలు చోట్ల అర్హత లేకున్నా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయా వైద్య బోర్డులలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైద్యులు మాత్రమే వైద్య సేవలు అందించాలి. అలాగే పాలిక్లినిక్‌ల పేరిట మెడికల్ షాప్‌ల యజమానులే ఏర్పాటు చేసి వైద్యం వ్యాపారంగా మారుస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నిత్యం తనిఖీలు చేసి అర్హత ఉన్న వైద్యుడే సేవలు అందిస్తున్నారా? లేదా? పర్యవేక్షించాలి. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అర్హతలేని వైద్యులు ఇష్టారాజ్యంగా వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్యారోగ్య శాఖ స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అర్హత లేని వారు ప్రాక్టీస్ చేయవద్దు
అర్హత లేని వారు ప్రాక్టీస్ చేస్తూ వైద్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత కలిగిన డాక్టర్లు మాత్రమే వైద్య సేవలు అందించాలి. అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు నిర్వహించిన వారిపైనా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి నిర్వహణకు వైద్యారోగ్య శాఖ నుంచి అనుమతి తప్పనిసరి.
– డాక్టర్ పల్వన్ కుమార్,
డీఎంహెచ్‌ఓ
పలు చోట్ల వైద్యం వికటించిన ఘటనలు..
జిల్లాలో పలు చోట్ల అర్హతలేని వారు వైద్య చికిత్స చేయడంతో వికటించి మృతి చెందుతున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో సెప్టెంబర్ 19న రాజు అనే వ్యక్తి అదే గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ దగ్గరికి వెళ్లాడు. పరిశీలించి ఇంజక్షన్ ఇచ్చాడు. అంతలోనే రాజు పరిస్థితి విషమించడంతో సిద్దిపేటలో ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన మహేశ్వరికి జ్వరం రావడంతో దుద్దెడలో ఓ ఆర్‌ఎంపీ దగ్గరకు వెళ్లారు. ఇంజక్షన్ వేయడంతో పాటు పలు రకాల మందులు రాశారు. దీంతో వైద్యం వికటించింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న మృతిచెందారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
పలుమార్లు వైద్యం వికటించిన ఘటనలు..
నకిలీ డాక్టర్లు, ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం
చోద్యం చూస్తున్న వైద్యారోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment