సిద్దిపేటకమాన్: న్యాయవాదులు నూతన చట్టాలపైనా అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. స్థానిక కోర్టులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ న్యాయవాదులు, సిబ్బందితో న్యాయమూర్తి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టోల్ ఫ్రీ నెంబర్ 15100 ద్వారా వచ్చే ఫోన్ కాల్స్‌కు న్యాయవాదులు న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని సూచించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌కు సంబంధించిన రిజిష్టర్‌ను న్యాయమూర్తి తనిఖీ చేసి, రిజిష్టర్ మెయింటెన్స్‌పై సూచనలు చేశారు.
పోలీస్ కుటుంబాల
సంక్షేమానికి కృషి: సీపీ
సిద్దిపేటకమాన్: పోలీసు కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుందని సీపీ అనురాధ తెలిపారు. సీపీ కార్యాలయంలో ఇటీవల విధి నిర్వహణలో మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కుటుంబ సభ్యులకు భద్రత ప్రమాద భీమా చెక్కును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రత స్కీమ్ ద్వారా రూ.8లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తనను కలవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ యాదమ్మ, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షులు రవిందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుడిపై తేనెటీగల దాడి
మిరుదొడ్డి(దుబ్బాక): ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చాట్లపల్లి బాలమల్లేశంగౌడ్ వృత్తి రీత్యా గీత కార్మికుడు. రోజు మాదిరిగానే గీత గీయడానికి ఈత చెట్ల వద్దకు వెళ్ళాడు. ఈత వనంలో ఒక్కసారిగా తేనెటీగలు బాలమల్లేశంపై దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన బాల మల్లేశంను స్థానికులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కొండపోచమ్మకు
పునర్జీవన కమిటీ
జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మకు పునర్జీవన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొండపోచమ్మ పాలకవర్గ సభ్యులుగా తిమ్మాపూర్‌కు చెందిన మెండె ఆగమల్లు, లింగాల వజ్రమ్మ (మందాపూర్), కోట ఆశయ్య(రాంనగర్), బీజీ వెంకటపూర్‌కు చెందిన నరేష్‌ను నయమించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపాల్ శాఖ కార్యదర్శి శైలజారామయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
పర్యావరణ పరిరక్షణతోనే ‘జీవ వైవిధ్యం’
ములుగు(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణతోనే జీవ వైవిధ్యం సాధించగలమని వైల్డ్ లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ అన్నారు. ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ‘అడవులు, జీవవైవిధ్యం.. వాతావరణ మార్పులు అనే అంశంపై గురువారం విద్యార్థులకు నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాలుష్యంతోనే పర్యావరణ దెబ్బతింటుందని, దీని ప్రభావంతో జీవరాశులు అంతరించి పోయే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విస్తృతంగా వృక్షాలు, వనాల పెంపు జరగాలని, కాలుష్య కట్టడికి పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలతోనే జీవ వైవిధ్యం పరిఢవిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెషర్ పురుషోత్తంరెడ్డి, మహిళా విశ్వవిధ్యాలయం ప్రొఫెషర్ వినీత పాండే, కళాశాల జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణతోమాలలకు తీరని అన్యాయం
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని, వెంటనే వర్గీకరణ ప్రక్రియను నిలిపివేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భద్రాచలంలో ప్రారంభం అయిన మాలమహానాడు పాదయాత్ర గురువారం సిద్దిపేటకు చేరుకుంది. అనంతరం అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భద్రాచలం నుంచి పాదయాత్ర చేపట్టామన్నారు.
మాట్లాడుతున్న న్యాయమూర్తి స్వాతిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment