కేజీబీవీలో సమస్యలు పరిష్కరించండి
మిరుదొడ్డి(దుబ్బాక): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాయలం (కేజీబీవీ)లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈమేరకు మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం బైఠాయించి ఆందోళనకు దిగారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ హరికిషన్‌కు అందజేశారు. వీరి ఆందోళనకు బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సూకూరి లింగం, నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ మొగుళ్ళ ఐలయ్య, రమేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గొట్టం భైరయ్యలు సంఘీభావం తెలిపారు. ఈ సదర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు బోధించే టీచర్లు సమ్మె బాట పట్టడంతో విద్యా బోధన కుంటుపడుతోందని అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులపై కాలం చెల్లిన ఫ్యాన్లు విరిగి పడి గాయాల పాలవుతున్నా పట్టించుకునే అధికారులు లేరని మండిపడ్డారు. ఇటు బోధించే వారు లేక, అటు నాణ్యమైన భోజనాన్ని అందించే వారు లేక హాస్టల్‌లో విద్యార్థులు ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కేజీబీవీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
విద్యార్థినుల తల్లిదండ్రుల డిమాండ్
తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయింపు
Comments
Please login to add a commentAdd a comment